
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
మెదక్‌టౌన్, వెలుగు : మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. పోచారం ప్రాజెక్ట్‌తో పాటు హవేలీ ఘనపూర్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను శుక్రవారం ఆయనతో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. అనంతరం మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడారు.
పోచారం ప్రాజెక్ట్‌కు రిపేర్లు చేసే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 108 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్‌ను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ కింద 10,500 ఎకరాలు సాగవుతున్నాయని, ప్రాజెక్ట్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే 14 గ్రామాలు మునిగిపోతాయన్నారు. రామాయంపేట బాలికల హాస్టల్, మెదక్ పట్టణంలోని పాలిటెక్నిక్ జూనియర్ కాలేజీలో నీళ్లు నిలిస్తే కలెక్టర్ ఎందుకు వెళ్లలేదని మండిపడ్డారు.
వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ఈ విషయంపై కేంద్రం స్పందించాలని కోరారు. ముంపు గ్రామాల ప్రజలకు ఆహారం, మంచి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సింహారావు, అడివయ్య, వెంకట్‌రావు, మెదక్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఎ.మల్లేశం, కె.మల్లేశం పాల్గొన్నారు.