షేర్ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో రూ.22 లక్షలు కొట్టేసిన్రు.. గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో ఘటన

షేర్ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో రూ.22 లక్షలు కొట్టేసిన్రు.. గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో ఘటన

అలంపూర్, వెలుగు : షేర్‌‌ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో సైబర్‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తి రూ.22 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడులో వెలుగుచూసింది. ఉండవెల్లి ఎస్సై శేఖర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి రెండేండ్ల నుంచి స్టాక్‌‌ మార్కెట్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేస్తున్నాడు. 

ఈ క్రమంలో ఇటీవల వాట్సప్‌‌లో ఓ లింక్‌‌ రావడంతో దానిని ఓపెన్‌‌ చేయగా... షేర్‌‌ మార్కెట్‌‌లో రూ. 50 వేలు పెట్టుబడి పెడితే రూ. 3 లక్షలు వస్తాయంటూ ఓ యాప్‌‌లో ప్రకటన కనిపించింది. ఇది నిజమేనని నమ్మిన వెంకటేశ్వర్‌‌రెడ్డి  జూన్‌‌ 25న రూ.లక్ష పెట్టుబడి పెట్టాడు. వెంటనే రూ.3 లక్షలు జమ అయినట్లు యాప్‌‌లో చూపించింది. 

దీంతో వెంకటేశ్వర్‌‌రెడ్డి జూన్‌‌ నుంచి సెప్టెంబర్‌‌ వరకు మొత్తం రూ.22,30,400 లు సదరు యాప్‌‌ ద్వారా పెట్టుబడి పెట్టాడు. తర్వాత యాప్‌‌ ద్వారా తన అకౌంట్‌‌ను చెక్‌‌ చేయగా.. అందులో రూ. 50 లక్షల బ్యాలెన్స్‌‌ ఉన్నట్లు చూపించింది. దీంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌‌కు వెళ్లగా... అకౌంట్‌‌లో బ్యాలెన్స్‌‌ లేదని బ్యాంక్‌‌ ఆఫీసర్లు తెలిపారు. 

యాప్‌‌ నిర్వాహకులకు ఫోన్ చేయగా.. రూ.13 లక్షల ట్యాక్య్‌‌ కడితేనే డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన వెంకటేశ్వర్‌‌రెడ్డి సెప్టెంబర్ 5న సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మంగళవారం ఉండవల్లి పోలీస్‌‌స్టేషన్‌‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.