దళిత బంధు సర్వే షురూ

దళిత బంధు సర్వే షురూ
  • హుజూరాబాద్​లో రంగంలోకి 400 మంది ఆఫీసర్లు

హుజూరాబాద్/జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వే శుక్రవారం ప్రారంభమైంది. మొత్తం ఐదు మండలాల పరిధిలో ఐదు రోజుల పాటు సర్వే జరగనుంది. దాదాపు 400 మంది ఆఫీసర్లు ఇల్లిల్లు తిరుగుతూ దళితుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వివరాలు నమోదు చేసుకుంటున్నారు. బ్యాంక్ సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నారు. హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో అక్కడి ప్రజాప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. హుజూరాబాద్ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సర్వేను ప్రారంభించారు. మండల కేంద్రంలోనే మరోచోట ఆర్డీవో రవీందర్ రెడ్డి సర్వేను ప్రారంభించి మాట్లాడారు. దళితుల కుటుంబ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు వారు కోరుకునే యూనిట్లను నమోదు చేసుకుంటామని చెప్పారు. వాళ్ల పరిస్థితులకు తగ్గట్లు ఏ స్కీమ్ బాగుంటుందో? ఎలా లబ్ధి జరుగుతుందో? తెలియజేస్తామన్నారు. సర్వే పూర్తయినంక సర్కార్ కు రిపోర్టు పంపుతామని తెలిపారు. సర్వేను విజయవంతం చేయాలని దళితులు, అధికారులను కోరారు. హుజూరాబాద్ లోని సింగాపూర్, జూపాక, రంగాపూర్, రాంపూర్, ధర్మరాజ పల్లె, జమ్మికుంటలోని ధర్మారం, కొత్తపల్లి , ఆబాది జమ్మికుంట, ఇల్లందకుంటలోని కనగర్తి, సిరిసేడు, మల్యాలతో పాటు వీణవంకలోని ఏడు గ్రామాల్లో సర్వే నిర్వహించారు.