
- గత ప్రభుత్వ హయాంలోనే డంపింగ్‌యార్డుకు అనుమతులు
- ప్రజాశ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
- జిల్లామంత్రి, ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లాం
- త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ .
నర్సాపూర్ వెలుగు : ఉనికిని కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక శాసన సభ్యురాలు గతాన్ని మర్చిపోయారని, ప్యారా నగర్ డంపింగ్ యాడ్ ఏర్పాటుకు కారకులు తనేనన్న సంగతి గుర్తు తెచ్చుకోవాలని విమర్శించారు. గత ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారని, అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
2015లో 152 ఎకరాల భూమిని కలెక్టర్, జిన్నారం తహసీల్దార్ పంచనామా చేసి జీహెచ్ఎంసీకి కేటాయించారన్నారు. 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇప్పటికే డంపింగ్ యార్డ్ విషయాన్ని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఎం దృష్టికి సైతం తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లలితానర్సింగ్, రుస్తుంపేట మాజీ ఎంపీటీసీ అశోక్, మేఘమాల, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేశం, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, హత్నూర మండలాధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.