ఏపీలో బ్లాక్ ఫంగస్ తో ఒకరి మృతి

ఏపీలో బ్లాక్ ఫంగస్ తో ఒకరి మృతి

అమరావతి: బ్లాక్ ఫంగస్ తో కృష్ణా జిల్లా నున్నలో చింతా వెంకటేశ్వరరావు (64) అనే వృద్ధుడు కన్నుమూశాడు. చికిత్స చేయించేందుకు ప్రయత్నించిన బంధువులకు బ్లాక్ ఫంగస్ కు ఉపయోగించే వ్యాక్సిన్ ఎక్కడా దొరకలేదు. ఆయన ఆసుపత్రిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటే.. ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయామని కుటుంబ సభ్యులు కంటతడిపెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఇంటివద్దే హోం ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా నెగటివ్ వచ్చినా కొద్ది రోజులకే తిరిగి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతుండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్ష చేసిన వైద్యులు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధిని నిర్మూలించే వ్యాక్సిన్ కోసం ఎంత ప్రయత్నించినా చుట్టుపక్కల ప్రాంతాలంతా ఆరా తీసినా ఎక్కడా దొరకలేదు. దీంతో చింతా వెంకటేశ్వరరావును ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.  బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ కోసం ఎంత వెదికినా దొరకలేదని.. ఆయన చావు బతుకులతో పోరాడుతుంటే.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి  వచ్చిందని కుటుంబ సభ్యులు కంటతడిపెట్టుకున్నారు.