
- బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తింపు
- డాక్టర్లతోపాటు మరో 8 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డులో నకిలీ ఇంజెక్షన్ల తయారీ ముఠా పట్టుపడింది. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉండడం దిగ్భ్రాంతి గొలుపుతోంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాడుల్లో ఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ ట్లో 3,293 నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు దొరికాయి. బ్లాంక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే లిపోసోమల్, యాంఫోటెరిసిన్-బి నకిలీ ఇంజెక్షన్లు చెలామణి అవుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అప్రమత్తమైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిఘా వేసి దాడులు చేయగా వాటిని తయారు చేసి అమ్ముతున్న ఇద్దరు డాక్టర్లతోపాటు మరో 8మంది పట్టుపడ్డారు. నిజాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్టర్ అల్తామాస్ హుస్సేన్ ఇంట్లో 3,293 నకిలీ ఇంజెక్షన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి చికిత్స పేరుతో వైద్యులు దోపిడీ చేస్తుండడంతో రోగులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా కొంత మంది నకిలీ వ్యాక్సిన్లు తయారు చేస్తుండడం.. మరికొంత మంది తమకు దొరికిన వ్యాక్సిన్లనే బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ తదితర కొత్త వేరియంట్లు బయటపడడంతో వాటికి చికిత్స కోసం వైద్యులు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో చికిత్స ఫీజులను నిర్ణయించాయి. చికిత్స ఫీజులను నోటీసు బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచుతుండడంతో అడ్డదోవలో డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్న వైద్యులు, వైద్య సిబ్బంది, మెడికల్ రెప్ లు, డ్రగ్ డీలర్లు తమకు తోచిన మార్గాల్లో డబ్బులు దండుకుంటుడగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా నకిలీ ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ముఠా పట్టుపడింది.
ఈ నకిలీ ఇంజెక్షన్ల తయారీ ముఠాలో ఇద్దరు వైద్యులే ప్రధాన ముద్దాయిలుగా ఉండడం కలకలం రేపుతోంది. ఈ ముఠా ఎప్పటి నుంచి.. ఎక్కడెక్కడ విక్రయించిన వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కరోనా పాండమిక్ చట్టాల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.