
గోవా.. కేవలం ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశిష్టమైనది. ఆ రాష్ట్రంలో ఎన్నో పవిత్ర దేవాలయాలున్నాయి. దేవాలయాల్లో జాతరలు .. ఉత్సవాలు.. జరుగుతుంటాయి. ఏడాదికొక్కసారి జరిగే ఉత్సవాలకు భక్తులు తరలివస్తుంటారు. ఆ దేవాలయం ఆచారం.. సంప్రదాయం ప్రకారం జాతరలు నిర్వహిస్తుంటారు. గోవా శ్రీలైరాయ్ ఆలయంలో జరిగే జాతరలో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాట కారణంగా కొంతమంది భక్తులు మరణించగా.. మరికొంత మంది గాయపడ్డారు.. గోవా శ్రీలైరాయ్ ఆలయ విశిష్టత .. అక్కడ జరిగే జాతర.. ఉత్సవాల ప్రాధాన్యత.. ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
గోవా శిర్గావ్లోని శ్రీ లైరాయ్ ఆలయంలో ఉన్న లైరా దేవివి అమ్మవారి అవతారంగా భావించి పూజలు చేస్తారు. పార్వతి దేవి స్వరూపంగా భావించి గోవా జానపద కథలలోని ఏడుగురు సోదరి దేవతలలో ఒకరు. ఈ దేవాలయానికి గోవా .. మహారాష్ట్ర.. కర్నాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.
గోవాలోని శ్రీలైరాయ్ ఆలయంలో ఈ రోజు నుంచి వార్షిక జాతర మొదలైంది. లైరా దేవి ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజున జాతర వైభవంగా జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గోవా నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ ఆలయంలో దశాబ్దాలుగా ఒక ఆచారం ఉంది. ఈ ఆలయంలో జాతర జరిగే సమయంలో నిప్పుల మీద నడుస్తారు. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర.. లైరై మాతా కీ జై అంటూ భక్తులు నినాదాలు చేస్తారు. వేలాది మంది భక్తుల ధోండ్ జాతర ప్రారంభమవుతుంది.
ఈ జాతర ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. దీనిన శిర్గావ్ జాతర.. లైరాయ్ జాతర అని కూడా పిలుస్తారు. గోవా ప్రజలు జరుపుకునే ప్రధాన పండుగలలో ఇది ఒకటి. ఈ జాతరలో బిచోలిమ్ లోని శిర్గావ్ గ్రామంలో లైరాయ్ దేవతను పూజిస్తారు. ఈ ఉత్సవాలకు 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.
లైరాయ్ దేవతను గోవాలో హిందువులు పూజిస్తారు. గోవా ప్రజలు లైరా దేవతను సంతాన దేవతగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ అమ్మవారిని దర్శిచుకొనే సాంప్రదాయం ఉంది. సంతానం కోసం ఈ దేవాయలంలోని అమ్మవారిని పూజిస్తారు.
వైశాఖ శుద్ద పంచమి రోజున జరిగే లైరాయ్ జాతరలో భక్తులు నిప్పులగుండంపై హరహరమహాదేవ... లైరాయ్ మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ నడుస్తారు. అలా నడిచే భక్తులరు ధోండ్లు అంటారు. అలా నడిచే వారు మొదటిసారి నడుస్తుంటే పండుగకు ముందు ఐదు రోజులు ఉపవాస దీక్ష పాటించాలని.. మిగతా వారు మూడు రోజులు ఉపవాసం ఉండాలి. కొంతమంది నెలరోజుల పాటు కఠిన దీక్షను పాటిస్తారు. ఈ నెల రోజులు పాలు..పండ్లు మాత్రమే తీసుకుంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ.. నేలపైనే పడుకుంటారు. జాతర సమయంలో పవిత్ర స్నానం చేసి.. నిప్పులగుండంపై నడిచి దీక్షను విరమిస్తారు.
గణపతి పూజ.. పుణ్యహవచనం.. అమ్మవారిని ఆవాహన చేయడం.. మండపారాధన తరువాత అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం చెరువుకు వెళ్లే దారిలో పూజారి కలశం తీసుకొని వెళతాడు. ఆ కలశంలో భక్తులు పిరమిడ్ రూపంలో ఉన్న సమిధలు ( హోమానికి ఉపయోగించే పుల్లలు) వేస్తారు. ఆ తరువాత పూజారి అగ్ని దేవతను ఆవాహన చేస్తాడు. ఈ ప్రక్రియను హోంఖాన్ అంటే పవిత్ర అగ్ని అంటారు. భక్తులు చెరువులో స్నానం చేసిన తరువాత హోమ్ ఖాన్చుట్టూ సంప్రదయ నృత్యాలు చేస్తారు. అందులోని సమిధలు పూర్తిగా నుశిమి అయ్యేంతవరకు భజనలు చేస్తారు. ఆ తరువాత ఈ నిప్పులను .. నిప్పుల గుండంగా తయారు చేసి వాటిపై నడుస్తారు.
దేవి లైరాయ్ పేరును జపిస్తూ భక్తులు బొగ్గుల గుండా పరిగెత్తుతారు. కొందరు మళ్లీ మళ్లీ నడుస్తారు. సూర్యోదయం సమీపిస్తున్నప్పుడు పండుగ ముగుస్తుంది. ఆ తరువాత భక్తులు మర్రిచెట్టుపై పూలదండలు వేసి ఇంటికి వెళతారు.
గోవాలోని శ్రీ లరాయ్ దేవీ ఆలయం ధార్మిక జాతరలో ఈ ఏడాది ( 2025) జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. గోవా ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. నార్త్ గోవా డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు.