ఆధ్యాత్మికం: సహనం అంటే ఏమిటి.. ఇదే మనశ్శాంతికి రాజమార్గాన్ని ఏర్పరస్తుంది..!

ఆధ్యాత్మికం:  సహనం అంటే ఏమిటి.. ఇదే మనశ్శాంతికి రాజమార్గాన్ని ఏర్పరస్తుంది..!

సహనం, శాంతం అవసరమని మన పెద్దలు చెబుతుంటారు నేర్పించారు. జీవితంలో ఆధ్యాత్మిక లక్షణాలను నేర్చుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. అసలు .. సహనం అంటే ఏమిటి ... దాని వలన ఏమి కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

సహనం  విషయంలో చాలామంది అది నాకు సంబంధించింది కాదు... అని కొట్టిపారేస్తుంటారు. మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ  భూమి భరిస్తూనే ఉంటుంది. అందుకేనేమో తత్వవేత్తలు సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నను... ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనం అవసరం.

సహనం అంటే కష్టమైన పరిస్థితులను కోపం లేదా అగౌరవంతో ప్రతిస్పందించకుండా, ఓపికగా మరియు స్థిరంగా ఎదుర్కోగల సామర్థ్యం. ఇది నిరీక్షణలో విలువను కనుగొనగలగడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మరియు పట్టుదలతో లక్ష్యాలను సాధించడం వంటి లక్షణాలను సూచిస్తుంది

సహనం మన సంస్కృతి...  ఇది యుగయుగాల సత్యం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలుణ్ని  వందతప్పుల వరకు క్షమించాడు. ఆ తరువాతే అతనిపై చర్య తీసుకున్నాడని పండితులు చెబుతున్నారు.  అంటే దేనికైనా టైం రావాలి..  త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు  అడవిలో  ఎన్నో ఇబ్బందులు పడ్డా జీవితాంతం సహనం వహించాడు. ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు కన్నతండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్నా..  విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్యకశిపుణ్ని అంతమొందించాడు. సహనం అనేది పరమాత్ముడు  జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

సహనం అంటే ఓర్పు... జీవికి మంచి మార్పు సహనం అంటే అసమర్థత కాదు. ధార్మికమైన బలాన్ని కూడగట్టుకుని సమర్థంగా పుంజుకోవడం. ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం. సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. 

సహనం సజ్జన లక్షణం. ...ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది. రజో, తమో గుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు. ఉన్నట్టు బయటికి కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు. సహజమైన ఓర్పునకు, నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి, కాకి బంగారానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ధర్మాచరణకు బాటలు పడతాయి.సహనం లేకపోతే అసహనం ప్రదర్శిస్తూ...  చేయరాని పనులను చేయిస్తుంది. కానీ సహనం ఆచితూచి అడుగు వేయిస్తుంది. 

 ప్రస్తుత సమాజంలో సహనంతో ఎవరైనా  ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉంటే వారిని  బలహీనులుగా పరిగణిస్తున్నారు.  కాని అది బలహీనత  కాదు... గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప...  అవలక్షణం కాదు.  భారతీయ సంస్కృతి  ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం సహనశీలతే అని పెద్దులు చెబుతున్నారు.  

సహనం వలనే  ఆది మానవత్వం మూర్తీభవించిన శక్తిగా మారింది. ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి ...కానీ ...మర్మదృష్టి ఉండకూడదు. 
సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. 'అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు'.... అన్నారు. 

సహనం ఉన్నవాడు సమాజంలో అజాత శత్రువుగా నిలుస్తాడు .  అంతశ్శత్రువులనూ జయించగలడు. ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని ఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. 

నిదానమే  ప్రధానమంటారు పెద్దలు. నిదానం అంటే సహనంగా ఉండటమే. సహనంలో భూమాతను మించిన వారు లేరు. జీవులు తనకు ఎన్ని అపచారాలు, అపకారాలు చేసినా భరిస్తుంటుంది. ఆ సహనంతోనే  ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోకకల్యాణం సాధ్యపడుతుంది. భువికి, దీవికి తేడా చెరిగిపోతుంది. సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సహనాన్ని దేశాలు అలవరచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది.

సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర పురాణాలే మనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టిలో కలవడం లాంటివి ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞత అని అంటాడు.

సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదానుగ్రహానికి చేరువ చేస్తుంది. మనిషికి విలువైనదేదీ తొందరగా దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్ట, నష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో జీవిస్తున్న మనిషి ద్వంద్వ వైఖరి లేకుండా చిత్త శుద్ధి ఎంతో అవసరం. స్పృహతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కనపెడితే విజ్ఞతతో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వలన భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది.

మనిషి అన్ని తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజమే కానీ, ఎదో అదృశ్యశక్తి అనేది పరిస్థితుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి యొక్క మంచి ఆలోచనలు సహనంతో ముడిపడి ఉంటాయి, ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో సహనం  తోడ్పడుతుంది.