- ఆదేశాలు జారీ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: ఇటీవల ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు పరిస్థితుల నేపథ్యంలో నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం తొలగించింది. అయితే, ఏ కారణంగా వారిని డిస్మిస్ చేశారనేదానిపై మాత్రం డీజీసీఏ క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఎయిర్‌లైన్స్ భద్రత, షెడ్యూల్‌కు సరిపడా విమానాలు ఉన్నాయా లేదా వంటి పనుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇండిగో సంక్షోభం తలెత్తిందని డీజీసీఏ భావిస్తోంది. అందుకే ఫ్లైట్ ఆపరేషన్స్ విభాగంలోని ఆఫీసర్లపై వేటు వేసినట్లు తెలుస్తోంది.
దీంతోపాటు విమానాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై విచారణ జరపాలని, బాధిత ప్రయాణికులందరికీ టికెట్ డబ్బులతోపాటు, కంపెన్షేషన్ చెల్లించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను డీజీసీఏ ఆదేశించింది. ఈ మేరకు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు సమన్లు జారీ చేయగా ఆయన శుక్రవారం ఢిల్లీలోని డీజీసీఏ ఆఫీసులోని నలుగురు సభ్యుల విచారణ ప్యానెల్ ఎదుట హాజరయ్యారు. విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చే చర్యలు, కొత్త పైలట్ల నియామకం వంటి విషయాలపై విచారణ కొనసాగుతోంది.
మరో 160 విమానాలు రద్దు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కొనసాగుతున్న రద్దీ, ఆలస్యం కారణంగా శుక్రవారం ఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌పోర్టుల నుంచి బయల్దేరాల్సిన, రావాల్సిన 160 విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకుముందు రోజు గురువారం కూడా ఈ రెండు ఎయిర్‌పోర్టుల నుంచి 200కు పైగా విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది.

