కేటీఆర్​ టూర్​పై డైలాగ్ వార్​

కేటీఆర్​ టూర్​పై డైలాగ్ వార్​

ఖమ్మంలో  మంత్రి కేటీఆర్​ పర్యటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ కార్యకర్త మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్​ పై కేటీఆర్​ పొగడ్తలు కురిపించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని మంత్రి అజయ్​ కు భయం పట్టుకుందని, దీని నుంచి కాపాడడానికే కేటీఆర్​ ఖమ్మం వచ్చారని కాంగ్రెస్​ నేతలు విమర్శించారు. టీఆర్ఎస్​ నేతలు మాత్రం బీజేపీ, కాంగ్రెస్​ విమర్శలపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్ల కంటే ముందున్న ఖమ్మం డెవలప్​ మెంట్ ను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని కౌంటర్​ ఇస్తున్నారు.

-  ఖమ్మం/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు

కేటీఆర్​ రాకతో నూతనోత్సాహం

మంత్రి కేటీఆర్​ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని టీఆర్ఎస్​ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. మంత్రి క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అజయ్​ రూ. వందల కోట్ల నిధులు తెచ్చి ఖమ్మం నగరాన్ని డెవలప్​ చేశారన్నారు. రాష్ట్రంలోనే నెంబర్​ వన్​గా ఖమ్మం ఉందని మంత్రి కేటీఆర్​ అనడం హర్షనీయమన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు నిన్నటి సభతో పుల్​స్టాప్​ పడిందన్నారు. మేయర్​ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్​ బచ్చు విజయ్​కుమార్, ఏఎంసీ చైర్మన్​ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్​ కమర్తపు మురళి, ఆర్జెసీ కృష్ణ పాల్గొన్నారు.

8 ఏండ్లలో ఏం చేసిన్రు

రాష్ట్రానికి, జిల్లాకు ఎనిమిదేండ్లలో ఏం చేశారో  మంత్రులు కేటీఆర్, అజయ్​ చెప్పలేకపోయారని, ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే బహిరంగసభ పెట్టారని కాంగ్రెస్​ నగర అధ్యక్షుడు మహ్మద్​ జావీద్​ విమర్శించారు. కాంగ్రెస్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మైనర్లు మద్యం, డ్రగ్స్​కు బానిసలవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పాలనను పట్టించుకోకుండా బీఆర్ఎస్​ అంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి అజయ్​కు ఓటమి భయం పట్టుకుందని, అతడికి ధైర్యం చెప్పేందుకే మంత్రి కేటీఆర్​ ఖమ్మం వచ్చారన్నారు. డంపింగ్​ యార్డ్​పై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో ఇతర జిల్లాల నుంచి పోలీసులను తెచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​కు19 స్ధానాలు కూడా రావన్నారు. కార్పొరేటర్​ మిక్కిలినేని మంజుల, కొట్టెముక్కల నాగేశ్వరరావు, మారం కరుణాకర్​రెడ్డి, ఏలూరి రవి పాల్గొన్నారు.

ఇక టీఆర్​ఎస్​ కు వీఆర్ఎస్సే

తెలంగాణలో టీఆర్​ఎస్​ పార్టీ పాలన రజాకార్లను తలపిస్తోందని బీజెపీ జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్​చార్జి​ పొంగులేటి సుధాకర్​రెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కేటీఆర్​ ఖమ్మం టూర్​ సందర్భంగా మహిళలు అని చూడకుండా బీజేపీ లీడర్లను అరెస్ట్​ చేశారన్నారు. సాయిగణేశ్​​ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని కోర్టుకు వెళితే, మంత్రి అజయ్​కు కేటీఆర్​ క్లీన్​చిట్​ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ కాదని, అది టీఆర్ఎస్​కు ఇక వీఆర్ఎస్సేనని అన్నారు. కేసీఆర్, కేటీఆర్​లకు రాజ్యాంగం, గవర్నర్​ వ్యవస్థపై కనీస గౌరవం లేదన్నారు. బీజెపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కార్పొరేటర్​ దొంగల సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, తమిళనాడు స్టేట్​ తిరువళ్లూర్​ ఈస్ట్​ జిల్లా అధ్యక్షుడు శరవణ్​కుమార్, లక్ష్మీనారాయణ, మందా సరస్వతి, అరుణ పాల్గొన్నారు.