- జిల్లాలో 1,81,449 ఎకరాలలో పంటలు
వనపర్తి, వెలుగు: జిల్లాలో 2025 యాసంగి సాగుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఈసారి 1,81,449 ఎకరాల్లో వివిధపంటలు సాగు అవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా లక్షా 27 వేల ఎకరాల్లో వరి సాగు జరగనుంది. కందులు, మొక్కజొన్న, వేరుశనగ పంటలు కూడా రైతులు సాగు చేయనుండడంతో అధికారులు ఆ మేరకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. వరి సాగు టాప్లో ఉన్నా నిరుటికన్నా విస్తీర్ణం తగ్గనుంది.
ఏటా యాసంగిలో సాగునీటి కొరత కారణంగా వరి సాగు చేయవద్దని చాలాకాలంగా వ్యవసాయశాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. వరికి బదులు ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నారు. అయినా.. కేఎల్ఐ కాల్వల కింద రైతులు చాలాఏండ్లుగా యాసంగిలోనూ వరి వేస్తూ వస్తున్నారు. అయితే జూరాల చివరి మండలాల్లోని ఆయకట్టుకు సాగు నీరు అందడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం లక్షా38 వేల ఎకరాలు కాగా లక్షా 27 వేల ఎకరాలకే వరి పరిమితం కావచ్చునని అధికారులు చెప్తుండగా.. సీజన్ చివరినాటికి కొంత విస్తీర్ణం పెరగవచ్చునని రైతు ప్రతినిధులు చెప్తున్నారు.
వానాకాలం సీజన్లో కష్టాలే
వానాకాలం సీజన్లో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా రైతులకు కష్టనష్టాలు తప్పలేదు. పొలాల్లో వరద నీరు చేరడంతో పొట్టకొచ్చిన వరి పూర్తిగా మునిగి పాడైపోయింది. కొన్ని చోట్ల ఇసుక మేటలు వేయగా పంటలు చేతికి అందలేదు. పంట దెబ్బతిన్న చోట భూగర్భ జలాలు బాగానే ఉండడంతో రైతులు యాసంగి పంటలకు సిద్ధమవుతున్నారు. జూరాల చివరి ఆయకట్టు రైతులు మాత్రం పరిస్థితిని చూసి సాగు చేయాలని భావిస్తున్నారు.
ఉచితంగా పల్లీ విత్తనాలు
గతంలో రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలపై రాయితీ ఇవ్వగా మూడు, నాలుగేండ్లుగా నిలిచిపోయింది. పచ్చిరొట్ట ఎరువులకే మాత్రమే రాయితీ ఇస్తోంది. దీంతో రైతులు ఓపెన్ మార్కెట్లో అధిక రేట్లకు సీడ్ కొంటున్నారు. అయితే.. ఈ సారి యాసంగిలో నేషనల్ఆయిల్కార్పొరేషన్ కొత్తరకం వేరుశనగ విత్తనాన్ని ఉచితంగా పంపిణి చేసింది. దీంతో ఈ సారి పల్లీ సాగు నిరుటికంటే కాస్త పెరగనుంది.
సాగయ్యే పంటల వివరాలు
పంట ఎకరాలు
వరి 1,27,498
మినుములు 22,016
వేరుశనగ 25,484
చెరకు 1553
యాసంగిలో అవసరమైన ఎరువులు
ఎరువు క్వాంటిటీ (మెట్రిక్ టన్నులు)
యూరియా 20,000
డీఏపీ 3050
ఎంవోపీ 2538
కాంప్లెక్సు 13,510
ఎస్ఎస్పీ 2346
