గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ట్రీట్ మెంట్ పొందుతున్న కరోనా పేషెంట్ల హెల్త్ కండీషన్ తెలియక వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని వారి బంధువులకు తెలియజేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అయినా సర్కార్ దవాఖానల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కొందరికైతే హాస్పిటల్స్ లో చేరిన తరువాత చనిపోయాడని మాత్రమే సమాచారం అందిస్తున్నారు. అది కూడా ఒక రోజు ఆలస్యంగా చెప్తున్నారు. కరోనా కారణంగా పేషెంట్ల వద్దకు అటెండర్లను ఎవరిని పంపడంలేదు. పేషెంట్ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేందుకు ప్రతి దవాఖానలో హెల్ప్ డెస్క్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకునేందుకు వేలాది రూపాయాలు ఖర్చు పెడుతున్నారు. హాస్పిటల్స్ లో పనిచేసే కొందరు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు ఎంతో కొంత డబ్బులు ఇస్తే వీడియో కాల్ ద్వారా పేషెంట్ ని చూపిస్తున్నారు.
సావు కబురే చెప్తున్నరు
దవాఖానల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి రోగి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పడం లేదు. చివరకు మీ బంధువు చనిపోయాడని, డెడ్ బాడీ తీసుకెళ్లండని ఫోన్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సావు కబురు చెప్పేందుకు ఫోన్ చేస్తునప్పటికీ, ఆరోగ్య పరిస్థితి ని కూడా ఫోన్ చేసి చెబితే బాగుంటుందని అంటున్నారు. గోల్నాకకు చెందిన ఎం.యాదగిరిని కరోనా బారిన పడడంతో ఈ నెల 25న సాయంత్రం కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్లో చేర్పించారు. వెళ్లేముందు నవ్వుకుంటూ వెళ్లాడని ఆ తరువాత ఏం జరిగిందో తమకు చెప్పలేదని, చివరకు మంగళవారం సాయంత్రం ఫోన్ చేసి మరణించినట్లు చెప్పారని యాదగిరి బంధువులు ఆందోళనకు దిగారు.
ఫోన్లు మాయమవుతున్నయ్
గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి దవాఖానల్లో పేషెంట్ల వద్ద ఫోన్లు మాయమైతున్నయి. పేషెంట్లు అడ్మిట్ అయిన సమయంలో వీడియో కాల్ చేసేందుకుఫోన్లు ఇచ్చి పంపుతున్నారు. ఆక్సిజన్‌పై ఉన్న కొందరు పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాతున్నారు. రాత్రి పేషెంట్లు నిద్రిస్తున్న సమయంలో ఫోన్లు ఎత్తుకెళ్తున్నారు. ఇలా ఒక్కో పేషెంట్ దగ్గరి నుంచి రెండు, మూడు ఫోన్లు పోతున్నాయి.
పేషెంట్‌తో మాట్లాడిస్తే రూ.500
రోగుల దగ్గర ఉన్న ఫోన్లు పోతుండటంతో డబ్బులిచ్చి పేషెంట్లతో మాట్లాడుతున్నారు. హాస్పిటల్స్‌లో పనిచేసే ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులకు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా డబ్బులు పంపితే వారు పేషెంట్ తో వీడియో కాల్ మాట్లాడిస్తున్నారు. ఇలా ఒకసారికి రూ.500 ఇస్తున్నట్లు పలువురు పేషెంట్ల బంధువులు చెప్తున్నారు. సిటీలో ప్రధానంగా గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి డిస్ర్టిక్ హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లకు ప్రభుత్వం ట్రీట్ మెంట్అందిస్తుంది. ఈ మూండిట్లోనే దాదాపు 1800 మంది పేషెంట్లు ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఈ పేషెంట్ల కోసం దాదాపు 3 వేల మంది బంధువులు హాస్పిటల్స్వద్ద పడిగాపులు కాస్తున్నారు.
