జాబ్ ల పేరిట మోసపోయిన యువకుడు సూసైడ్..హనుమకొండలోని విద్యుత్ నగర్ లో ఘటన

జాబ్ ల పేరిట మోసపోయిన యువకుడు సూసైడ్..హనుమకొండలోని విద్యుత్ నగర్ లో ఘటన

హనుమకొండ, వెలుగు: కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ ల పేరిట డబ్బులు ఇచ్చి మోసపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన ఎండీ హఫిజాబేగం -బాషామియా దంపతుల కొడుకు ఎండీ అష్రఫ్(29) ఎంబీఏ చదివాడు. హనుమకొండలోని విద్యుత్ నగర్ లో ఇంటిని అద్దెకు తీసుకుని సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. 

అతనికి కడిపికొండ గ్రామానికి చెందిన హసనొద్దీన్ అనే వ్యక్తితో పరిచయమైంది. తనకు కార్పొరేట్ కంపెనీలతో పరిచయాలు ఉన్నాయని, ఎవరికైనా జాబ్ లు కావాలంటే పెట్టిస్తానని నమ్మించాడు. అష్రఫ్ కొందరు యువకులకు జాబ్ ఇప్పిస్తానని, డబ్బులు తీసుకుని హసనొద్దీన్ కు ఇచ్చాడు. జాబ్ లు ఇప్పించకపోవడంతో డబ్బులిచ్చిన యువకులు ఒత్తిడి చేస్తుండడంతో అష్రఫ్ పలుమార్లు నిలదీశాడు. హసనొద్దీన్ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో మనస్తాపం చెందాడు. 

గురువారం అర్ధరాత్రి ఆఫీసులో ఫ్యాన్ కు అష్రఫ్ ఉరేసుకున్నాడు. తల్లి హఫిజాబేగం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం ఉదయం అష్రఫ్ ఫ్రెండ్స్ ఆఫీస్ కు వెళ్లి చూడగా, సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయి కనిపించాడు.  సమాచారం అందించగా సుబేదారి పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సుబేదారి పోలీసులు తెలిపారు.