అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్‍ లక్ష్యం :  ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్‍ లక్ష్యం :  ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍/ హనుమకొండ సిటీ/ పర్వతగిరి, వెలుగు: అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే రాష్ట్రంలో నిర్వహించే సీఎం కప్‍ లక్ష్యమని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హనుమకొండ జవహర్లాల్‍ నెహ్రూ స్టేడియంలో నియోజకవర్గస్థాయి సీఎం కప్‍ పోటీలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత క్రీడాభివృద్ధికే ఇస్తోందన్నారు.

సీఎం రేవంత్‍రెడ్డి స్వయంగా క్రీడాకారుడు కావడంతో ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్​ జిల్లా ఒలింపిక్​ అసోసియేషన్​ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‍ అజీజ్‍ఖాన్‍ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఐదంచెల పోటీలు నిర్వహిస్తోందన్నారు.

శాట్ అబ్జర్వర్ నందకిషోర్ గోకుల్, హనుమకొండ డీవైఎస్ వో  గుగులోతు అశోక్ కుమార్ ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు తోట శ్యాం ప్రసాద్, సృజన్ కాంత్, లిల్లీ ఫ్లోరెన్స్, శ్రీధర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి హైస్కూల్​లో ఏర్పాటు చేసిన సీఎం కప్​ మండల స్థాయి క్రీడాపోటీలను ఎంపీడీవో శంకర్​ నాయక్, పర్వతగిరి సీఐ రాజగోపాల్​ ప్రారంభించారు.