- ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండియర్ పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్
- టీచర్లను నియమించాలని మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ సీటు సాధించిన గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు టాలెంట్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్ భాషపై సరైన పట్టులేని కారణంగా మెడికల్ టెర్మినాలజీ అర్థం కాక సతమతం అవుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అటువంటి విద్యార్థుల కోసం స్పెషల్ గా స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆరోగ్య శ్రీ ఆఫీసులో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కాళోజీ హెల్త్ వర్సీటీ వీసీ డాక్టర్ రమేశ్ రెడ్డి తదితరులతో మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికోలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
మారుమూల ప్రాంత పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు దక్కుతున్నాయని, అయితే వీరిలో చాలా మంది తెలుగు మీడియం నుంచి రావడంతో ఇంగ్లీష్ లో ఉండే మెడికల్ టెర్మినాలజీ అర్థం చేసుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. తోటి స్టూడెంట్స్తో మాట్లాడలేక... ఆత్మన్యూనత భావంతో కుంగిపోతున్నారని, ఒత్తిడి తట్టుకోలేక... ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతున్నారని వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కు స్పెషల్ గా ఇంగ్లీష్ భాషపై క్లాసులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
దేశవ్యాప్తంగా మెడికోలు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా మందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి మెడకిల్ కాలేజీలో విద్యార్థుల కోసం సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు.
