- దుండగులను శిక్షించాలని గ్రామస్తుల ధర్నా
వికారాబాద్, వెలుగు: తాజాగా సర్పంచ్‌గా గెలిచిన ఓ మహిళ భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా సంగయ్య భార్య బసమ్మ గెలుపొందారు. కోటపల్లి మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా సంగయ్య కొంతమందితో కలిసి అక్కడికి వెళ్లి పరామర్శించారు. తిరిగి గురువారం రాత్రి 11 గంటలకు కోటిపల్లికి చేరుకున్నారు.
ఆ సమయంలో అప్పటికే తన ఇంటి సమీపంలో మాటు వేసి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేశారు. కాలనీ వాసులు రావడంతో దుండగులు పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న సంగయ్యను హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దాడిని నిరసిస్తూ కోట్పల్లి మండలకేంద్రంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ధారూర్ సీఐ రఘురాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను త్వరగా పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. యశోదలో చికిత్స పొందుతున్న సంగయ్యను ఎమ్మెల్సీ డాక్టర్ మహేందర్ రెడ్డి, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ పరామర్శించారు.
