- పాతబస్తీలో కబ్జాకు గురైన ఏడెకరాల ప్రభుత్వ భూమి
- భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
- నిజాంపేట్ 17 ఎకరాల్లో వెలిసిన కబ్జాలు
- రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు హైడ్రా చర్యలు
హైదరాబాద్ సిటీ/ ఓల్డ్‌సిటీ/ జీడిమెట్ల, వెలుగు: రెండు వేర్వేరు చోట్ల రూ.1,700 కోట్ల భూములను హైడ్రా కాపాడింది. చుట్టూ ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించి ఆక్రమించిన వారిని హైడ్రా ఖాళీ చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ బండ్లగూడలోని కందికల్ గ్రామంలో మహ్మద్‌నగర్– లలితాబాగ్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో సర్వే నంబర్ 28, బ్లాక్ ఎఫ్, వార్డు నంబర్ 274లో 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే రెండెకరాలు కబ్జాకు గురై ఇండ్లు కూడా వెలిశాయి.
ఈ ఇండ్ల జోలికి వెళ్లకుండా కబ్జాలోని ఏడెకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం చూడగా అక్కడ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కానీ, చెరువు ఆనవాళ్లు ఎక్కడా లేకుండా మట్టితో కబ్జాదారులు కప్పేశారు. ఈ భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్ వెంకటేశ్కుటుంబ సభ్యులు, ఇతరులు పోరాడుతున్నారు. వీరిపై భవానీపురం పోలీసు స్టేషన్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన వారసులు కూడా ఈ భూమి తమదంటూ చెబుతుండగా.. వారి వద్ద నుంచి పట్టాభిరామి రెడ్డి కొన్నానంటూ మరోవైపు కబ్జాలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ మేరకు కోర్టులో కేసు కూడా వేశాడు. అయితే, ప్రభుత్వ భూమిని ఏ ప్రాతిపదికన తనదిగా చెప్పుకుంటారని కోర్టు సమయం వృథా చేసినందుకు రూ. కోటి ఫైన్ వేసింది.
అయినా, కబ్జాదారులు ఖాళీ చేయకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు హైడ్రా ఈ స్థాలాన్ని కాపాడింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో, పోలీసు బందోబస్తు మధ్య ఇనుప రేకుల ప్రహరీని తొలగించి శుక్రవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ బోర్డులు పెట్టింది. హైడ్రా కాపాడిన ఈ ఏడెకరాల విలువ దాదాపు రూ. 400 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంటను కబ్జాదారుల చెర నుంచి విముక్తి కల్పించిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.
నిజాంపేటలో రూ.1,300 కోట్ల భూమి..
బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామంలో ప్రభుత్వ భూమిని రక్షించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. శుక్రవారం సర్వే నంబర్లు 186, 191, 334లోని మొత్తం 17 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం ఇప్పటికే కబ్జాకు గురైన నేపథ్యంలో, రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు హైడ్రా జోక్యం చేసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. పరిశీలనలో సర్వే నం. 334లో 4 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. అనంతరం నివాసాలను జోలికి పోకుండా మిగిలిన 13 ఎకరాల్లోని తాత్కాలిక షెడ్లను తొలగించి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.ఈ 13 ఎకరాల భూమి విలువ సుమారు రూ.1300 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
