పైన కొబ్బరి బోండాలు.. కింద గంజాయి ప్యాకెట్లు

పైన కొబ్బరి బోండాలు.. కింద గంజాయి ప్యాకెట్లు
  • 401 కిలోల సరుకును పట్టుకున్న ఈగల్ ఫోర్స్
  • విలువ సుమారు రూ.2 కోట్లపైనే..
  • అబ్దుల్లాపూర్​మెట్​లో ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: కొబ్బరి బోండాల మధ్య 401 కిలోల గంజాయి దాచి తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఈగల్ ఫోర్స్ పట్టుకున్నది. ఈ గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పుష్ప సినిమా తరహాలో డ్రగ్స్, గంజాయి సరిహద్దులు దాటిస్తున్న ముఠాలపై ఈగల్ ఫోర్స్ నిఘా పెట్టింది. ఈ మేరకు తాజాగా రాజస్థాన్ గ్యాంగ్​ను అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలపై ఈగల్ ఫోర్స్ అధికారులు బుధవారం ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు. రాజస్థాన్ కు చెందిన చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్ కొంత కాలంగా గంజాయి సప్లై చేస్తున్నారు.

ఏపీలోని రాజమండ్రికి చెందిన సప్లయర్ శ్రీధర్ వద్ద కిలో గంజాయిని రూ.2 వేలకు కొనుగోలు చేసి రాజస్థాన్ లోని అశు, బికనీర్​లో రూ.4 వేల చొప్పున అమ్మేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం రాజమండ్రి నుంచి 401 కిలోల గంజాయితో డీసీఎంలో బయలుదేరారు. కొబ్బరి బొండాల కింద గంజాయి దాచారు. డీసీఎం ముందు కారులో ఎస్కార్ట్ గా ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. 

పక్కా సమాచారం అందుకున్న ఖమ్మం, రాచకొండ ఈగల్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో డీసీఎంను అడ్డుకున్నారు. కొబ్బరిబోండాల కింద దాచిన గంజాయి ప్యాకెట్లను వెలికితీశారు. వారి వద్ద నుంచి కారు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.