
Bharat Mata Coin : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం(RSS) 100వ వార్షికోత్సవ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక రూ.100 కాయిన్ అలాగే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. దీంతో భారత కరెన్సీపై మొట్టమొదటి సారిగా 'భరతమాత' చిత్రాన్ని ముద్రించారు. ఈ నాణెంపై ఒక వైపు జాతీయ చిహ్నం.. మరో వైపు భరతమాత శక్తికి ప్రతీకగా సింహంతో కూడిన వరద ముద్ర రూపం ఉంది.
ఆర్‌ఎస్‌ఎస్ 1925లో విజయదశమి రోజున స్థాపించబడినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సంస్థ దేశసేవ, ధర్మవిజయం, నిజాయితీ, ఓర్పు వంటి విలువలకు ప్రతీకగా నిలిచిందని చెప్పారు. 1963లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో RSS స్వయం సేవకులు పాల్గొన్న దృశ్యం పోస్టల్ స్టాంపుపై ముద్రించారు.
ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో విభిన్న రంగాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ దేశాభిమానానికి దోహదపడుతోందని ఈ సందర్భంగా మోడీ కొనియాడారు. ముందు దేశం అనేది ఆర్‌ఎస్‌ఎస్ విధానం అన్నారు మోడీ. ఈ 100 సంవత్సరాల ప్రయాణం దేశ సేవలో అత్యంత గౌరవప్రదంగా నిలిచిందని తెలిపారు. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద ఎన్‌జీవోగా పనిచేస్తోందని అన్నారు ప్రధాని.
ALSO READ : బిలియనీర్ల క్లబ్‌లోకి షారుఖ్
విజయదశమి పండుగ ఈ ఏడాదిలో ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. అన్యాయంపై న్యాయం గెలిచిన దినంగా, చెడుపై మంచిని సూచిస్తూ ఈ రోజు నిరంతరం జరుపుకుంటారని ప్రధాని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ద వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని, ఇది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదపడుతున్నదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతీయ జాతీయ చైతన్యానికి, భారతమాత పట్ల గౌరవానికి.. అలాగే దేశ సేవకు ఒక మైలురాయిగా నిలిచింది.