
సామాన్య మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులు ఆపిల్ ఐఫోన్ లాంటి ఖరీదైన ఉత్పత్తులు కొనటం కష్టమే. వారికి వచ్చే ఆదాయం ఇలాంటి లగ్జరీ వస్తువులు కొనటానికి సపోర్ట్ చేయవు. రోజువారీ జీవనానికి మాత్రమే చాలా మందికి సంపాదన సరిపోతుంటుంది. అయితే ఒక కుర్రోడు క్రేజీగా ఐఫోన్ ఐప్యాడ్ కొనటానికి తన 17 ఏళ్ల వయస్సులో కిడ్నీ అమ్మేయగా ప్రస్తుతం దీన పరిస్థితుల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఐఫోన్ కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిందే అనే సాధారణ వాడుకలో ఉన్న మాటలను ఫాలో అయ్యి చివరికి తనలా తప్పు చేయెుద్దని చెబుతున్నాడు ఈ కుర్రోడు.
అవును చైనాకు చెందిన వాంగ్ షాంగ్కున్ అనే యువకుడు తన 17వ ఏట ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొనాలనుకున్నాడు. అయితే పేద కుటుంబ నేపథ్యం వల్ల ఆర్థిక పరిస్థితి సహకరించక అది అసాధ్యమని గుర్తించాడు. కానీ ఎలాగైనా ఆపిల్ ఫోన్ కొనాలని అందరి యువకుల్లా కలగన్నాడు. దీని కోసం వాంగ్ దీనికి అవసరమైన డబ్బు సంపాదించటానికి బ్లాక్ మార్కెట్లో తన కిడ్నీ అమ్మేశాడు. ఒక్క కిడ్నీతో కూడా ఆరోగ్యంగా బతకొచ్చని ఆన్‌లైన్‌లో అవయవాల అక్రమ రవాణా గ్యాంగ్ చెప్పటంతో వారి మాటలు నమ్మేశాడు.
దీంతో చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని ఒక చిన్న పట్టణంలో కిడ్నీ రాకెట్ సూచించిన చోట సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఆ క్లినిక్ సరైన సంరక్షణ, సేఫ్టీ పద్దతులు పాటించకుండా కిడ్నీ తొలగించారు. అయితే డబ్బులు వచ్చిన సంతోషంతో నచ్చిన ఐఫోన్, ఐప్యాడ్ కొనుక్కుని గర్వంగా ఇంటికి తిరిగి వెళ్లాడు. కానీ ఈ సంతోషం మూన్నాళ్లు ముచ్చుటగా మారిపోయింది. కొన్ని నెలలకే అపరిశుభ్రమైన వాతావరణంలో శస్త్రచికిత్స కారణంగా అతని మరో కిడ్నీ ఇన్ఫెక్షన్ కి గురైంది. ప్రస్తుతం అది కేవలం 25 శాతం మాత్రమే పనిచేయటంతో 31 ఏళ్ల వయస్సులో పూర్తిగా అనారోగ్యంతో డయాలసిస్‌పై జీవిస్తున్నాడు.
అయితే ఈ ఘటన ఐఫోన్ల మోజులో యువత చేస్తున్న కొన్ని ప్రమాదకర తప్పులను ఎత్తి చూపుతోంది. ఇప్పటికీ చాలా మంది ప్రమాదకరమైన షార్ట్‌కట్‌లను తీసుకోవడానికి ప్రలోభపడుతున్నారు. అయితే అక్రమ అవయవాల అమ్మకాల ప్రమాదాల గురించి ఇతరులకు అవగాహన కల్పించాలనే ఆశతో వాంగ్ తన జీవిత అనుభవాన్ని పంచుకున్నాడు. క్షణిక కోరికతలో చేసే తప్పులకు లైఫ్ లాంగ్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వాంగ్ యువతను హెచ్చరిస్తున్నాడు.