
- కేటీఆర్తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
జడ్చర్ల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అరబిందో ఫ్యాక్టరీపై విచారణ చేయకపోతే తగులబెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ‘ఫ్యాక్టరీ ఓనర్లను బెదిరించిమీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది, ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అనిరుధ్ రెడ్డి తప్పుబట్టారు.
తన నియోజకవర్గ రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తానని, ఏ పోరాటమైనా చేస్తానన్నారు. చెరువులో చేపలు చనిపోతుండడంతో ముదిరాజ్ బిడ్డల కోసం ప్రశ్నిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్లో ఏ ఎమ్మెల్యే అయినా.. ఏ రోజైనా.. తనకు సంబంధించిన ఇష్యూపై మాట్లాడాడా? అని నిలదీశారు. ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కాంగ్రెస్‌లో ఉందన్నారు. అధికారంలో ఉండగా రౌడీయిజం, అరాచకత్వ పాలన చూసి ప్రజలు బొంద పెట్టారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా కమీషన్ వస్తే చాలని ఊరుకున్నాడని విమర్శించారు. ఈ సమస్యపై మాట్లాడలేదని గుర్తించాలన్నారు.