ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహిషాసురమర్ధినిగా పార్వతీదేవి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో  మహిషాసురమర్ధినిగా పార్వతీదేవి

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారు ‘మహిషాసురమర్ధిని’ అలంకారంలో భక్తులను కనువిందు చేశారు. మహిషాసురమర్ధిని అవతారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకుని తరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రాతఃకాల పూజలు, చతుషష్టి ఉపచార పూజ, అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి మూలమంత్ర జపాలు, సహస్రనామార్చన నిర్వహించారు. 

ఇక సాయంత్రం ఆలయంలో నిత్య పూజలు ముగిసిన తర్వాత.. అమ్మవారికి నవావరణ పూజ, కుమారి పూజ, సుహాసిని పూజ, సహస్రనామార్చన, మహార్నవమి నీరాజన మంత్ర పుష్పాలు వంటి పూజా కైంకర్యాలు నిర్వహించి తీర్థప్రసాద వినియోగం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ, ప్రధానార్చకులు నర్సింహరాములు, సహాయ అర్చకులు తదితరులు ఉన్నారు.