ఐటీడీఏతో చెంచుల అభివృద్ధికి కృషి : ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఐటీడీఏతో చెంచుల అభివృద్ధికి కృషి :  ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అమ్రాబాద్, వెలుగు :  ఐటీడీఏతో చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి - చేస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.  శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  నల్లమల ఏజెన్సీలోని చెంచుల జీవనస్థితులు, ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఐటీడీఏ ద్వారా చెంచుల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజాపాలనలో సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ చెంచు ఐక్య వేదిక అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెంచులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందశారు. మన్ననూర్ ఐటీడీఏలో రెగ్యులర్ పీఓతో పాటు సిబ్బందిని నియమించాలని, అంతరించే దశలో ఉన్న చెంచు, కొలం, గోండు, తోటి, కొండారెడ్డి తెగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. దీనికి స్పందించిన చైర్మన్, ఈ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ సలోని చాభ్రా, చెంచు సంఘాల నాయకులు పాల్గొన్నారు.