- వివరాలు తెలుసుకొని కొడుకు వద్దకు పంపించిన ఆర్డీవో
జగిత్యాల, వెలుగు: వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులు.. ఆమెను రోడ్డు మీద వదిలేసిన ఘటన ఇది. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన కుర్రె లక్ష్మి భర్త నారాయణదాసు చనిపోవడంతో కొడుకులు కుర్రె కృష్ణ, శ్రీనివాస్ వద్ద ఉండేది. పెద్దకొడుకు కృష్ణ జగిత్యాలలో స్థిరపడగా.. చిన్నకొడుకు శ్రీనివాస్ మల్యాలలోనే ఉంటున్నాడు. ఆస్తి పంపకాల్లో శ్రీనివాస్‌కు పాత ఇల్లు వచ్చింది. ఈక్రమంలో శ్రీనివాస్ పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు కట్టుకోగా.. తల్లిని ఇంట్లోకి తీసుకునేందుకు చిన్న కొడుకు నిరాకరించాడు.
దీంతో ఆమె పెద్ద కొడుకు కృష్ణ వద్దే ఉంటోంది. అయితే ఆమె మళ్లీ చిన్నకొడుకు వద్దకు రాగా.. అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు ‘ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లు.. నేనూ వస్తా’ అంటూ శ్రీనివాస్ తల్లిని ఆటోలో ఎక్కించాడు. ఉదయం వెళ్లిన ఆమె.. సాయంత్రమైన ఒక్క కొడుకు కూడా రాకపోవడంతో ఆర్డీవో కార్యాలయం ఎదుటే తిండి, నీళ్లు లేకుండా చలికి వణికుతూ వేచిఉంది. గమనించిన ఆర్డీవో మధుసూదన్ ఆమె పరిస్థితిని ఆరా తీశారు. ఆమె జరిగిన విషయం చెప్పడంతో ఆయన వెంటనే పెద్ద కొడుకుకు ఫోన్ చేసి, ఆమెను తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరు కొడుకులు తప్పనిసరిగా తన ముందు హాజరు కావాలని ఆదేశించాడు. దీంతో ఆయన వచ్చి తల్లిని తీసుకెళ్లాడు.
