17 తర్వాతే ఎలక్షన్ షెడ్యూల్?

17 తర్వాతే ఎలక్షన్ షెడ్యూల్?

 

  • ఈసీ అరుణ్ గోయల్ రాజీనామా ఎఫెక్ట్

  • 15న కొత్త కమిషనర్ల కోసం సెలెక్ట్ కమిటీ భేటీ

  •  ఏకాభిప్రాయం తర్వాత రాష్ట్రపతికి ఫైల్

  •  గెజిట్ విడుదల తర్వాత నియామకం పూర్తి

  •  అపాయింట్మెంట్లు పూర్తయ్యాకే ఎలక్షన్  ప్రక్రియ

ఢిల్లీ:  కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా నేపథ్యంలో లోక్ సభ ఎలక్షన్ షెడ్యూల్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 13 షెడ్యూల్ వెలువడుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 17వ తేదీ తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు కమిషనర్లు ఉంటారు. అయితే ఇద్దరు కమిషనర్లలో అనూప్‌ చంద్ర పాండే పదవీ కాలం ఫిబ్రవరిలో  పూర్తి కావడంతో ఆయన దిగిపోయారు. ఇద్దరితోనే లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తారని అంతా భావించారు.  ఈ తరుణంలో కమిషనర్ అరుణ్​ గోయల్ రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మాత్రమే మిగిలారు. ఒక్కరితో లోక్ సభ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కొత్త కమిషనర్ల ఎంపిక కోసం ఈ నెల 15న సెలెక్ట్ కమిటీ భేటీ జరుగనుంది. కారణాలు ఏవైనా గోయల్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈ నెల 13 లేదా 14వ తేదీ వెలువడుతుందని భావించిన షెడ్యూల్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

15న సెలెక్ట్  కమిటీ భేటీ


ప్రధాని మోడీ, ఓ కేంద్రమంత్రి, విపక్ష నేతతో కూడిన సెలెక్ట్ కమిటీ 15వ తేదీన సమావేశం కానుంది.  కొత్త కమిషనర్ల నియామక ప్రక్రియలో న్యాయ మంత్రి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ, ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సహా ఐదు పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫైనల్ ఎంపిక నిర్వహిస్తుంది. వారి నియామకాల్ని రాష్ట్రపతి ఆమోదించి గెజిట్ ద్వారా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ మార్చి 15న ప్రారంభం కానుండటంతో ఎంత వేగంగా చేసినా కనీసం 16వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది.  ఆ తర్వాత కొత్త కమిషనర్లతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.  అంటే 17వ తేదీ లేదా ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.