నారీశక్తిని చాటేలా...!

నారీశక్తిని చాటేలా...!
  •     రిపబ్లిక్ డే పరేడ్ లో త్రివిధ దళాల నుంచి మహిళా విభాగాల కవాతు 
  •     ఫస్ట్​టైమ్​మహిళా కళాకారుల మ్యూజిక్ తో పరేడ్ ప్రారంభం
  •     దేశ సంస్కృతిని చాటేలా త25 శకటాల ప్రదర్శన
  •     ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రన్ 
  •     77 వేల సీటింగ్ కెపాసిటీతో ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధం

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో 75వ రిపబ్లిక్ డే సంబురాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ లో నారీశక్తిని చాటేలా త్రివిధ దళాల నుంచి మహిళా విభాగాలు కవాతులో పాల్గొంటున్నాయి. వికసిత్ భారత్, భారత్ లోక్​తంత్ర్ థీమ్ లతో వేడుకలు జరగనున్నాయి. ఫస్ట్​టైమ్ 100 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ పరేడ్ ప్రారంభించనున్నారు. ఇందులో శంఖం, నాదస్వరం, నగారా వంటి భారతీయ సంగీత వాద్య పరికాలు వినియోగించనున్నారు.

 పరేడ్ లో పాల్గొనే త్రివిధ దళాల కంటింజెంట్లకు కెప్టెన్ సంధ్య సారథ్యం వహించనున్నారు. అలాగే త్రివిధ దళాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, కేంద్ర సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీస్ విభాగాల నుంచి ప్రత్యేకంగా మహిళా కంటింజెంట్లు తమ పాటవాలను ప్రదర్శించబోతున్నాయి. వివిధ విభాగాల్లో ఈసారి మహిళలకు అత్యుత్తమ ప్రాతినిధ్యం కల్పించినట్లు కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీ గిరిధర్ వెల్లడించారు.   

పరేడ్​లో ఫ్రెంచ్ బలగాల కవాతు 

ఈసారి గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మాక్రన్ హాజరుకానున్నారు. పరేడ్ లో ఫ్రెంచ్ బలగాలు కూడా కవాతు చేయనున్నాయి. 95 మందితో పరేడ్​టీమ్, 33 మందితో బ్యాండ్ టీమ్ పాల్గొననున్నాయి. అలాగే యుద్ధ విమానాల ఫ్లై–పాస్ట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫ్లైట్ తో పాటు, ఒక మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంఆర్ టీటీ) విమానం, ఫ్రెంచ్ ఎయిర్​ఫోర్స్​కు చెందిన రెండు రాఫెల్ జెట్స్ పాల్గొంటాయని అధికారులు తెలిపారు.

  వేడుకలు ప్రత్యక్షంగా చూసే వారికోసం రక్షణ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 77 వేల మందికి సరిపోయేలా సీట్లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 42 వేల సీట్లను సాధారణ ప్రజల కోసం కేటాయించారు. రూ.20 రేటుతో 4,320 టికెట్లు, రూ.100 రేటుతో 37,680 టికెట్లు ఆన్​లైన్​లో అమ్మకానికి పెట్టారు. అలాగే దేశవ్యాప్తంగా లైవ్ చూసేందుకు డీడీ చానల్ లింక్​లను రక్షణ శాఖ అందుబాటులో ఉంచనుంది.  

25 శకటాల ప్రదర్శన

‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే థీమ్ తో ఈ సారి 25 శకటాలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో16 శకటాలను రాష్ట్రాలు/యూటీలు ప్రదర్శిస్తున్నాయి. మిగిలిన శకటాలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, త్రివిధ దళాలకు చెందినవి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడోసారి శకటం 
ప్రదర్శించనున్నారు.  

కర్తవ్యపథ్ లో టెక్స్ టైల్ ఎగ్జిబిషన్ 

రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్యపథ్ మార్గంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ‘అనంత్ సూత్ర– ది ఎండ్ లెస్ థ్రెడ్’ పేరుతో వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్ డిజైన్ లను తెలిపేలా 1,900 చీరలు, వస్త్ర డిజైన్లను ఇక్కడ ప్రదర్శించనున్నారు. పెద్ద పెద్ద ఫ్రేమ్ లతో ఏర్పాటు చేయబోయే ప్రతి చీర, వస్త్రం డిజైన్ తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఉంచుతున్నారు. ఇక 75వ గణతంత్ర వేడుకల్లో భాగంగా కేంద్ర రక్షణ శాఖ స్మారక నాణెం, స్మారక స్టాంప్ ను రిలీజ్ చేయనుంది.  

13 వేల మంది స్పెషల్ గెస్టులు

కేంద్రం13 వేల మంది స్పెషల్ గెస్ట్ లకు ఇన్విటేషన్లు పంపింది. ప్రభుత్వ జన్ భాగిదారీ దార్శనికతకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి పరేడ్ లో అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ తయారీ రంగాలు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మహిళా కార్మికులు, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు, యోగా టీచర్లు, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో విజేతలు, పారాలింపిక్ పతక విజేతలు పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ), పీఎం ఉజ్వల యోజన, పీఎం వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి, పీఎం కృషి వంటి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు కూడా అవకాశం కల్పించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్, వైబ్రంట్ గ్రామాల సర్పంచ్‌లు, స్వచ్ఛ భారత్ అభియాన్, ఉత్తమ స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు సైతం హాజరుకానున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, ఉద్యోగులకూ స్పెషల్ ఇన్విటేషన్లు అందాయి.