మా భూమిని బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన్రు

మా భూమిని బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన్రు

బెల్లంపల్లి, వెలుగు : తమ భూమిని బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేశారంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్డీవో ఆఫీసు ఎదుట ఓ బాధిత కుటుంబం ఉరితాళ్లతో మంగళవారం ఆందోళనకు దిగింది. బాధిత కుటుంబసభ్యులు దుర్గం లక్ష్మి, రాజయ్య, లక్ష్మయ్య, పోషం, నాగార్జున, శ్రీనివాస్ మాట్లాడారు. తమ తాత లస్మయ్య పేరుపై బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారులో ఉన్న రెండెకరాల 75 సెంట్ల భూమిని కాసిపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ లీడర్​, సింగిల్ విండో చైర్మన్ భుక్యా రామచందర్, మంచిర్యాలకు చెందిన సత్య రాజు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు.

1956 నుంచి అది తమ తాత పేరుపైనే ఉందన్నారు. అందులో తాము పంటలు సాగుచేసుకుంటుండగా భూమి తమదే అంటూ దౌర్జన్యానికి దిగారని, ప్రశ్నించిన తమను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే బెదిరించాడని వాపోయారు. తహసీల్దార్​, ఆర్డీవో, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడు ఆ భూమిని ఫ్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టారన్నారు. తమ సమస్య పరిష్కారం కావట్లేదని ఉరితాళ్లతో నిరసనకు దిగినట్లు చెప్పారు. న్యాయవ్యవస్థపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై తమకు నమ్మకం ఉందన్నారు. వెంటనే స్పందించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని, లేకపోతే తమకు చావే శరణ్యమని వాపోయారు.