
- రూ.4 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి అప్పగింత
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉదారత చాటుకున్నారు. యాచారం మండల కేంద్రంలోని రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులో నిర్మించిన భవనంతో సహా వ్యవసాయ శాఖకు కేటాయిస్తూ సంబంధిత పత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు అందజేశారు.
కోదండరెడ్డికి తన చిన్నాన్న మల్లారెడ్డి ఇచ్చిన ఈ భూమిని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం ఈ స్థలంలో రైతుమిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. దీనిని ధాన్యం కొనుగోలు కేంద్రంగా, సీజనల్ పంటల నిల్వ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ భూమిని వ్యవసాయ శాఖకు పూర్తిగా అప్పగిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కోదండరెడ్డి తెలిపారు.
నెల రోజుల క్రితం రైతు కమిషన్ బృందం, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి యాచారం మండలంలో పర్యటించిన సందర్భంగా కోదండరెడ్డి ఈ భూమిని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ అధికారులకు చూపించారు. శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో జరిగిన సమావేశంలో భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
అదే విధంగా, యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు కోసం ప్రైవేట్ స్థలాన్ని సేకరించి, బస్టాండ్ సమీపంలో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని రైతుకమిషన్ మంత్రిని కోరింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్, ఏవో హరి వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.