V6 News

రూ.250 కోట్ల ఫ్రాడ్.. కుషాయిగూడలో భూనిర్వాసితుల ధర్నా

రూ.250 కోట్ల ఫ్రాడ్.. కుషాయిగూడలో భూనిర్వాసితుల ధర్నా
  • నిందితుడు ధనుంజయ్​ను అరెస్ట్​ చేయాలని డిమాండ్​

మల్కాజిగిరి, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూలు జిల్లా రైతులకు సంబంధించిన నష్టపరిహారం నిధుల్లో సుమారు రూ.250 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ గుప్తా కుషాయిగూడలోని సుభాష్​నగర్​లో నివాసముంటున్నాడు. మంగళవారం బాధిత రైతులు ఆయన ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ‘ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్’ పేరుతో తమను సంప్రదించి తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని, పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మించారని బాధితులు ఆరోపించారు.

సుమారు 25 గ్రామాలకు చెందిన 3 వేల మంది భూనిర్వాసితులు, రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారన్నారు. 300 మంది రైతులు ధర్నాలో పాల్గొన్నారు. నిందితుడు ధనుంజయ్​ను అరెస్ట్​ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు పాశం యాదగిరి సంఘీభావం తెలిపారు. ఈ ఇష్యూలో కోర్టు ఆదేశాల మేరకు నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం.