లారీ ఢీకొని తండ్రీకూతురు మృతి.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విషాదం

లారీ ఢీకొని తండ్రీకూతురు మృతి..  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విషాదం

చేవెళ్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. వికారాబాద్‌‌ జిల్లా కోట్‌‌పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్‌‌(32), కుమార్తె కృప(13)ను మొయినాబాద్‌‌ మండలం తొల్కట్ట గ్రామ శివారులోని గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదివిస్తున్నాడు. బాలికకు జ్వరం రావడంతో స్కూల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.  

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం రవీందర్ బైక్ పై వచ్చి స్కూల్ నుంచి కృపను ఇంటికి తీసుకెళ్తుండగా పట్టణ కేంద్రంలోని హైదరాబాద్‌‌-– బీజాపూర్‌‌ రహదారిలో ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్‌‌పై ఉన్న రవీందర్‌‌, కుమార్తె కృప లారీ చక్రాల కింద పడిపోయారు. దీంతో రవీందర్‌‌ స్పాట్ లోనే మరణించగా.. కొన ఊపిరితో ఉన్న కృపను చేవెళ్ల ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. 

బొలెరోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి గాయాలు

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం షాపూర్ గేట్ వద్ద ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు.