
రేగొండ, వెలుగు: మారు తండ్రిని చంపిన కేసులో కొడుకుతో పాటు మరో ఐదుగురిని జయశంకర్భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సంపత్ రావు బుధవారం రేగొండ పీఎస్‌లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం కొంపల్లికి చెందిన పర్శ రవి(40) తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న రేణుకను కొన్నాళ్ల కింద రెండో పెండ్లి చేసుకోగా ఒక కొడుకు పుట్టాడు. రెండో భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన రేణుక మొదటి భర్త కొడుకు పాతపల్లి శ్రీకర్ చంపేందుకు ప్లాన్ చేశాడు. కొంపల్లికి చెందిన కాయిత శ్రీపాల్, హనుమకొండకు చెందిన బొమ్మకంటి ఉదయ్ చందర్ సాయం కోరాడు. ఉదయ్ చందర్ తన బంధువులైన పసుల సందీప్, మొలుగూరి నరేశ్‌ను కలిసి రూ.1.50 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. వీరికి శ్రీపాల్ ముందుగా రూ. 25 వేలు, అనంతరం రూ.14 వేలు, రూ. 3 వేలు, రూ. 10 వేలు మూడుసార్లు గూగుల్ పే ద్వారా పంపించాడు.
హనుమకొండలో సురేశ్వద్ద మారుతి డిజైర్ అద్దెకు తీసుకున్నారు. ప్లాన్‌లో భాగంగా నలుగురు కలిసి రవి మొదటి భార్య కొడుకుకు జాబ్ ఇప్పిస్తామని నమ్మించారు. అతనితో పాటు రేణుకను ఈనెల 10న కారులో తీసుకెళ్లారు. మధ్యలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొంపల్లి శివారులోని వైన్ షాప్ వద్ద మద్యం తాగుదామని ఆగారు. అక్కడ మద్యం తాగినట్టు నటిస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుమలగిరి గ్రామ పరిధి బుగులోని గుట్టల్లోకి తీసుకెళ్లి రవి మెడకు తాడుతో బిగించి హత్య చేశారు.
డెడ్ బాడీని చెట్ల పొదల్లో వేసి అతడి జేబులోని రూ. 20 వేలను తీసుకుని, తాడు పడేసి పారిపోయారు. రవి మృతిపై మొదటి భార్య బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు హనుమకొండలో దాక్కున్నారు. బుధవారం రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్ సిబ్బందితో కలిసి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకర్ సెల్ ఫోన్ లోని ఫొటోల ఆధారంగా హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి తాడు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మల్లేశ్ యాదవ్, షాఖాన్ సిబ్బంది ఉన్నారు.