
- ఇండ్లు, కొట్టాల్లోకి వస్తుండడంతో భయం గుప్పిట్లో జనం
- మందర్నా, హున్సా, ఖాజాపూర్, హంగర్గా, మిట్టాపూర్ ఇతర పల్లెల్లో టెన్షన్
నిజామాబాద్, వెలుగు : మంజీరా వరదలో విషసర్పాలు, నల్లతేళ్లు కొట్టుకొస్తున్నాయి. బతుకు ఆగమై బరువెక్కిన గుండెతో ఇండ్లకు చేరుకుని బురదను తొలగిస్తూ సామగ్రిని వెతుక్కుంటుండగా నాగుపాములు, రక్తపింజర్లు, కట్లపాములు, తేళ్లు కనిపిస్తూ కలవరపెడుతున్నాయి. గదులు, తలుపులు, కిటికీ సందులు, వరండాలు, పశువుల కొట్టాల్లోకి విష కీటకాలు వస్తుండడంతో జనం వణికిపోతున్నారు. చెట్లపై సర్పాలు పాకుతుండటం ఏ చెట్టు కింద కూర్చోలేక, ఎక్కడికెళ్లాలో అర్థం కాక గోస పడుతున్నారు. కంటికి నిద్ర లేక, కడుపు నిండా తిండి లేక విలవిల్లాడిపోతున్నారు. ఏం కష్టమొచ్చే వానదేవుడా అంటూ బోరున విలపిస్తున్నారు.
40 ఏళ్ల తర్వాత భారీ వరద..
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా విస్తరించిన మంజీరాలో 40 ఏళ్ల తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాధారణంగా వర్షాకాలంలో గట్టు కింద నుంచే నీరు పారుతుండేది. ఈసారి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో పాటు కౌలాస్ నాలా, లెండి, కల్యాణి, సింగీతం, నల్లమడుగు, నల్లవాగు ప్రాజెక్టుల నీరు చేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం గోదావరిలో కలిసిపోవాల్సి ఉన్నా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో మంజీరా ప్రవాహం స్లో అయింది. దీంతో నదిలో కొట్టుకొచ్చిన పాములు, తేళ్లు మందర్నా, హున్సా, ఖాజాపూర్, కల్దుర్కి, రాంపూర్, హంగర్గా, నీల, కందకుర్తి, మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాల్లోకి చొరబడ్డాయి.
సామగ్రిని కదలించడానికి భయపడుతున్న ప్రజలు చెట్లపై పాకే పాములను చూసి ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అత్యంత విషపూరితమైన నల్లతేళ్లు పక్కనే తిరుగుతుండటంతో బాధిత కుటుంబీకులు హడలిపోతున్నారు. కనిపించిన సర్పాలు, తేళ్లను యువకులు చంపుతూ తమవారిని కాపాడుకుంటున్నారు. ఎన్‌పీడీసీఎల్ ఇంజినీర్లు యుద్ధప్రాతిపదికన కరెంట్ పునరుద్ధరించినా, నదితీర పల్లెల్లో ఆందోళనకర వాతావరణం కొనసాగుతోంది.
ఇండ్ల స్థలాలిచ్చినా.. వెళ్లలేదు
మంజీరా ముంపు గ్రామాలను షిఫ్ట్చేయాలని ప్రభుత్వం చాలా కాలం క్రితమే చర్యలు చేపట్టింది. హంగర్గా గ్రామానికి 15 ఏళ్ల క్రితం రూ.20 కోట్లు పరిహారం చెల్లించి, కొప్పర్గాకు సమీపంలో భూమి కేటాయించింది. గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ప్రస్తుత హంగర్గా విలేజ్ లేకపోయినా, పరిహారం అందుకున్న ప్రజలు మళ్లీ పాత ఇండ్లలోనే ఉంటున్నారు. మందర్నా, హున్సా గ్రామాలకు పోతంగల్ మండలంలోని రాంగంగానగర్‌లో 15 ఎకరాల భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించినా ప్రజలు వెళ్లలేదు. ప్రస్తుతం ఆ ప్లాట్లను ఇతరులు కబ్జా చేశారు.