- సీఎంకు ఎఫ్జీజీ లేఖ
హైదరాబాద్, వెలుగు: అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఏసీబీ అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. లంచం తీసుకుంటూ చిక్కిన అధికారులతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఆయా శాఖల నుంచి అనుమతి లభించడం లేదు. అన్ని ఆధారాలతో ప్రభుత్వానికి రిపోర్ట్ అందించినా ఏండ్ల తరబడి ప్రాసిక్యూషన్ అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఐదేండ్లుగా 519 కేసులు ప్రాసిక్యూషన్ అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ (ఎఫ్జీజీ) అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఇటీవలే లేఖ రాశారు.
అవినీతి అధికారులపై నమోదైన కేసుల్లో త్వరగా ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వాలని, ఆ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రాసిక్యూషన్ జాప్యం వల్ల అవినీతి అధికారుల్లో భయం లేకుండా పోయిందని తెలిపారు. రోజుకు సగటున ఇద్దరు, ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కుతున్నారని పేర్కొన్నారు.
