పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే 

ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలని ఆసిఫాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మొదటి విడత పోలింగ్​జరిగే లింగాపూర్, సిర్పూర్-(యు), జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఎస్సైలు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాల సభ్యులతో నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు. 

కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో బిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి జూమ్ మీటింగ్ లో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడతలో 5 మండలాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు 27 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రానికి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారని తెలిపారు. 

27న ఉదయం 10:30 గంటలకు ముందే ఫారం 1 నోటీసు, ఓటర్ల జాబితా, స్థానాల వివరాలను నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ప్రదర్శించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ పరిశీలన, తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.