సూర్యాపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో మాట్లాడారు. మూడు విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో 6,94,815 మంది ఓటర్లు ఉండగా, మొదటి రెండు విడతల్లో ఎనిమిది మండలాలు, మూడో విడతలో ఏడు మండలాల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఆపై లెక్కింపు చేస్తామని తెలిపారు.
ఎన్నికల కోడ్ గ్రామీణ మండలాల్లో అమల్లో ఉంటుందని, మీడియా వార్తలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్ణయించిన ఖర్చు, నామినేషన్ డిపాజిట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు రవాణాపై నిఘా పెంచినట్టు వెల్లడించారు.
అధికారులంతా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని, నామినేషన్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, డివిజనల్ పీఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ అర్బన్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్యా భవన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్వోలు, స్టేజ్- వన్ ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
మొదటి విడత 14 మండలాల్లోని 117 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. ఎన్నికలను అధికారులందరూ సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల కేంద్రం వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తగినన్ని నామినేషన్ ఫారాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, నల్గొండ, చండూరు ఆర్డీవోలు వై. అశోక్ రెడ్డి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
