అధికారుల నిర్లక్ష్యం.. నిలిచిన పత్తి కొనుగోలు

అధికారుల నిర్లక్ష్యం.. నిలిచిన పత్తి కొనుగోలు
  • రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన రైతులు

చండూరు, వెలుగు: నాణ్యత, తేమ పేరుతో కొర్రీలు పెడుతూ పత్తి పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చండూరు మండలం బంగారిగడ్డ మంజిత్ కాటన్ మిల్లు వద్ద పత్తి రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్లాట్ బుక్ చేసుకొని పత్తిని తీసుకొని వస్తే నాణ్యత లేదని పదిమంది రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయలేదు. 

దళారులు తెచ్చిన పత్తిని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేస్తున్న సీసీఐ నిర్వాహకులు, నాణ్యత పేరుతో ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు ప్రశ్నించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రంగు మారిన పత్తిని కొనుగోలు చేయకపోతే రైతు నష్టపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతలేని పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.