ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

దేశరాజధాని ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2024, జూన్ 25వ తేదీ మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

ప్రేమ్‌నగర్‌లోని ఓ భవనంలో ఉదయం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజిన్లతో అదుపు చేశారు. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన  నలుగురిని ఫైర్ సిబ్బంది రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇన్వర్టర్ నుండి మంటలు చెలరేగినట్లు పోలీసులు, ఫైర్ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో భవనం మొదటి అంతస్తులోని సోఫాకు మంటలు అలుముకుని.. తర్వాత మంటలు ఫ్లోర్‌ మొత్తాన్ని చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హీరా సింగ్ (48), నీతూ సింగ్ (46), రాబిన్ (22), లక్ష్య (21)లుగా గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.