
- ఒక్క సర్కిల్లోనే రోజుకు రూ.13 వేలు లోపలకు..
- రిజిస్టర్లలో సంతకాలు.. డ్యూటీలకు డుమ్మాలు
- రిపేర్లలో ఉన్న మెషీన్లతో ఫాగింగ్ చేస్తున్నరట
- రిపేర్లు చేయకుండానే బిల్లుల క్లెయిమ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో దోమల నివారణకు చేసే ఫాగింగ్ ను ఆ విభాగపు సిబ్బంది గాలికి వదిలేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల ఫాగింగ్చేయాలని కమిషనర్ఆదేశించినా అసలు పట్టించుకోవడం లేదు. కానీ, ఫాగింగ్చేస్తున్నామంటూ దొంగ రికార్డులు చూపుతూ రూ. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. దాదాపు ప్రతి సర్కిల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
ఈ వ్యవహారాన్ని చూసీ చూసీ తట్టుకోలేని మల్కాజిగిరి సర్కిల్ ఎంటమాలజీ వర్కర్లు ఈ నెల 1న ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చి ఆ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఒక్కో సర్కిల్ లో రోజూ120 లీటర్ల డీజిల్, 8 లీటర్ల పెట్రోల్ ను ఫాగింగ్ పేరుతో కాజేస్తున్నారని లెక్కలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క సర్కిల్లోనే రోజూ రూ.13వేల వరకు దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ ఫిర్యాదుపై బల్దియా విజిలెన్స్అధికారులు ఫోకస్పెట్టారు.
డ్యూటీకి రాకపోయినా మేత ఆగలే..
సిటీలో ఫాగింగ్ చేయకుండానే డీజిల్, పెట్రోల్ బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జులై 7న బక్రీద్పండుగ ఉన్నా వర్కింగ్డేగానే ప్రకటించారు. కానీ, మల్కాజిగిరి సర్కిల్లో 17 మంది వర్కర్లు విధులకు హాజరు కాలేదు. కానీ, వీరందరూ డ్యూటీలకు వచ్చారని, ఫాగింగ్చేశామని చెప్పి డీజిల్, పెట్రోల్నొక్కేశారు. పైగా, బక్రీద్పండగ రోజు సూపర్ వైజర్ నజీర్ డ్యూటీకి వచ్చారని రిజిష్టర్లో సంతకం కూడా చూపించారు. 17 మంది సంతకాలను పెట్టడం మాత్రం మర్చిపోయారు.
దీంతో ఇక్కడ జరుగుతున్న వ్యవహారం బయటపడింది. ఈ ఫిర్యాదుపై సికింద్రాబాద్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గా ప్రసాద్ వివరణ కోరగా కింది స్థాయిలో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. ఇక శేరిలింగంపల్లిలో సీనియర్ ఎంటమాలజిస్ట్ లేకపోవడంతో కొన్ని చోట్ల ఫాగింగ్ పూర్తిగా జరగడంలేదు. వర్కర్లు ఫీల్డ్ కు రాగానే అటెండెన్స్ వేసి పంపిస్తున్నారు. అన్ని జోన్లలో సూపర్ వైజర్లు, ఏఈలు ఏండ్లుగా కొనసాగుతుండటంతో దందా కొనసాగుతోంది.
రిపేర్ల పేరుతో బిల్లులు
బల్దియా ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో చాలా ప్రాంతాల్లో దోమల నివారణ కోసం చిన్న ఫాగింగ్ మెషీన్లు 300, పెద్ద మెషీన్లు 63 ఉన్నాయి. ప్రతి డివిజన్ కి చిన్న మెషీన్లు రెండు, ప్రతి సర్కిల్ కి పెద్ద మెషీన్లు రెండింటితో ఫాగింగ్ చేయాల్సి ఉంది. అయితే ఇందులో దాదాపు 50 మెషీన్ల వరకు ఎప్పుడూ రిపేర్లోనే ఉంటున్నాయి. అయినా, వీటిని కూడా వాడుతున్నట్టు చెప్పి డీజిల్, పెట్రోల్ ఉపయోగించినట్టు రిజిస్టర్ లో రాస్తున్నారు. మెషీన్లకు రిపేర్లు చేయకుండానే చేసినట్లు సీనియర్ ఎంటమాలజీస్టులు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొందరు ఎంటమాలజీ ఎస్ఈలు, సూపర్ వైజర్లు కుమ్మక్కై అన్ని మెషీన్లు పని చేస్తున్నట్లు రికార్డుల్లో రాసి డీజిల్ నొక్కేసి బయట అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.కోట్లల్లో ఖర్చు.. అయినా మార్పేది..
గ్రేటర్ లో దోమల నివారణ కోసం బల్దియా రూ. కోట్లను ఖర్చు చేస్తోంది. 2020–-21లో రూ.25 కోట్లు, 2021–22 లో రూ.25 కోట్లకు పైగా, 2022–23లో రూ.30 కోట్లు, గతేడాది రూ.32 కోట్లు ఖర్చు చేసింది. ఈ సారి కూడా రూ.30 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా గ్రేటర్ లోని 4850 కాలనీల్లో ఎప్పటికప్పుడు దోమలను ఫాగింగ్చేసి పారదోలుతున్నామని చెప్తున్నా ఎక్కడా మార్పు కనిపించడం లేదు.
కార్డు సిస్టం అమలు చేసినా....
డీజిల్ దందాకు చెక్ పెట్టేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ డీజిల్ కూపన్లకు బదులుగా ఏటీఎం కార్డు తరహాలో కార్డు సిస్టం అమలు చేశారు. దీన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్ లో అమలు చేశారు. వచ్చేనెల 1 నుంచి మిగతా కొన్ని జోన్లలో అమలు చేయనున్నారు. అయితే, ఈ కార్డు సిస్టం ద్వారా కూడా మార్పు రాదని పలువురు అంటున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లతో కుమ్మక్కై డీజిల్, పెట్రోల్స్థానంలో డబ్బులు తీసుకుంటూ బిల్లులు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కూపన్ల స్థానంలో కార్డులను అదే తరహాలో వాడే అవకాశముంది. ఇప్పటికే ప్రారంభించిన జోన్ లోఇదే తరహాలో ఓ ఏఈ దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
జూన్ 7న బక్రిద్ ఫెస్టివల్ ఉంది. అయితే ఆ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఆ రోజు మల్కాజిగిరి సర్కిల్ లో సూపర్ వైజర్ నజీర్ ఒక్కరు మాత్రమే హాజరు కాగా, మిగతా 17 మంది వర్కర్లు హాజరు కాలేదు. అయితే ఒక్క వర్కర్ కూడా హాజరు కాకపోగా, ఆ రోజు ఫాగింగ్ చేసినట్లు డీజిల్, పెట్రోల్ విత్ డ్రా చేశారు.