ఫారెస్ట్​ సిబ్బంది, ​కానిస్టేబుల్​పై ఇసుక మాఫియా దాడి

ఫారెస్ట్​ సిబ్బంది, ​కానిస్టేబుల్​పై ఇసుక మాఫియా దాడి

బూర్గంపహాడ్, వెలుగు: వేర్వేరు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాదారులు ఫారెస్ట్​ సిబ్బంది, కానిస్టేబుల్​పై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని ఉప్పుసాక పంచాయతీ పరిధి అటవీ ప్రాంతంలోని దోమలవాగు నుంచి  శనివారం ఉదయం టేకులచెరువు గ్రామానికి చెందిన వ్యక్తులు ట్రాక్టర్ తో అక్రమంగా ఇసుకను తోలుతున్నారు. సమాచారం అందడంతో ఉప్పు సాక బీట్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఇద్దరు గార్డులను వెంటబెట్టుకొని దోమలవాగు వద్దకు వెళ్లారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకున్నారు. విషయం తెలిసి టేకులచెరువు ఉప సర్పంచ్ బొల్లా శ్రీశైలం, మరో ఇద్దరితో అక్కడకు చేరుకొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్  చేతిలోని ఫోన్ లాక్కున్నారు. అతడితో   పాటు మరో ఇద్దరు గార్డులపై దాడిచేసి గాయపర్చారు. తర్వాత ఇసుక ట్రాక్టర్ ను తమతో తీసుకెళ్లిపోయారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్ ఫిర్యాదు మేరకు బూర్గంపహాడ్ ఎస్సై బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పినపాక పట్టీనగర్​లో కానిస్టేబుల్ పై..
ఇసుక రవాణా చేస్తున్న వారిని అడ్డగించిన కానిస్టేబుల్ పై ఇసుక మాఫియా దాడి చేసింది. పినపాక పట్టీనగర్ కిన్నెరసాని వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్సై బాలకృష్ణ తో కలిసి కానిస్టేబుల్ ప్రసాద్ పినపాక పట్టీనగర్​ చేరుకున్నారు. ఎస్సై రోడ్డుపై ఆగగా, కానిస్టేబుల్ వాగులో లోడ్ అవుతున్న ట్రాక్టర్ల వద్దకు వెళ్లారు. దాంతో ఇసుక లోడింగ్ చేస్తున్న కూలీలతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు పరారయ్యారు. ఎస్సై ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించాలని ఆదేశించి వెళ్లిపోయారు. అయితే అక్కడకు చేరుకున్న ట్రాక్టర్ల యజమానులు ఇసుకను డంపింగ్ చేసి ట్రాక్టర్లను తరలించుకుపోవాలని ప్రయత్నించారు.  కానిస్టేబుల్ వారి ప్రయత్నాలను అడ్డుకోవడంతో అతడిపై దాడి చేశారు. కానిస్టేబుల్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.