జమ్మికుంట, వెలుగు: కరీనంగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద రూ.24 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ ను ఇసుక మాఫియా కూల్చివేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. గతంలో హుస్సేన్ మియా వాగుపై, నిర్మల్ జిల్లా స్వర్ణవాగుపై చెక్‌డ్యామ్‌లను ఇలాగే పేల్చివేశారని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో ఇటీవల కూలిపోయిన చెక్ డ్యామ్‌ను మంగళవారం మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్టంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. మానేరుపై చెక్ డ్యామ్ కూల్చి మూడు రోజులైనా ఇప్పటి వరకూ కూల్చిన వారిని పట్టుకోలేదన్నారు. ఈ చెక్ డ్యాంపై విజిలెన్స్ విచారణ జరిగిందని, అంతా బాగుందని నివేదిక ఇచ్చారని తెలిపారు. చెక్ డ్యామ్ ను నిర్మించిన రాఘవ కన్ స్ట్రక్షన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ బ్లాస్టింగ్ లు చూస్తే ఆనాడు మేడిగడ్డలో కూడా ఇలాగే జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారనే అనుమానం వస్తుందన్నారు. ఇసుక మాఫియా వెనక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, దానిని అరికట్టాలని డిమాండ్ చేశారు. చెక్ డ్యామ్ కూల్చివేతకు బాధ్యులను గుర్తించి, రూ.23 కోట్లను రికవరీ చేయాలన్నారు. ఎల్ఎండీ గేట్లు ఎత్తిన సమయంలో లక్ష క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని గట్టిగా ఉన్న చెక్‌డ్యామ్ ఇప్పుడెలా కూలిందని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి, అందులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి మూసీ నదికి నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకర రవిశంకర్, సంజయ్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
