
చండీగఢ్: కొడుకు అఖీల్ అఖ్తర్ మృతి కేసులో తనతోపాటు తన భార్య రజియా సుల్తానా (మాజీ మంత్రి)పై వస్తున్న ఆరోపణలను పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా ఖండించారు. కోడలితో తనకు ఎఫైర్ ఉందన్న ప్రచారంలో నిజంలేదని..అదంతా రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ఈమేరకు ఆయన ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ లో మీడియాతో మాట్లాడారు."మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదు.
రాజకీయ కుట్రలో భాగంగానే మాపై కేసు నమోదైంది. నిరాధార ఆరోపణలతో మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వారు కూడా చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మా కొడుకు అఖీల్ అఖ్తర్ 10వ తరగతి నుంచే డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దాదాపు 18 ఏండ్లుగా ట్రీట్మెంట్ అందిస్తున్నం. కానీ చికిత్స కొనసాగుతుండగానే ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఆ తర్వాత సైకోసిస్ కారణంగా ఏదేదో ఊహించుకోవడం, భ్రమపడటం ప్రారంభించాడు.
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మమ్మల్ని వేధించేవాడు. డ్రగ్స్ కొనేందుకు డబ్బుల కోసం తన భార్యను, తల్లిని వేధించేవాడు. అతడి చర్యలు భరించలేక మా కోడలు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బిడ్డలతో ఉంటోంది. మనవడు, మనవరాలు సైతం తండ్రి వల్ల నరకం చూశారు. బుప్రెనార్ఫిన్ ఓవర్‌డోస్ వల్లే అఖీల్ మరణించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీడియోలు చేసే సమయంలో అతడు మానసికంగా ఆరోగ్యంగాలేడు. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తం" అని ముస్తఫా పేర్కొన్నారు.