- చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు
- కేటీఆర్ ఏ1గా నిరుడుడిసెంబర్ 19న కేసు
- ఈ ఏడాది జనవరి 9, జూన్ 16న ప్రశ్నించిన ఏసీబీ
- మొత్తం 10 మందిపై అభియోగాలు
- వెయ్యికి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్ట్
- ఫార్ములా రేసుతో హెచ్‌ఎండీఏ నిధులు 54.89 కోట్లు దుర్వినియోగం
- సంస్థకు రూ.75.88 కోట్ల నష్టం
- క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్‌ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మెడకు ఫార్ములా–-ఈ రేసు కేసు ఉచ్చు బిగుసుకుంటున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న ఆయనను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు గురువారం అనుమతి ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏసీబీ.. కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అనంతరం ఆ ఫైల్‌ను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. ఏసీబీ నివేదికను, సేకరించిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించిన గవర్నర్.. ఈ కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఒక మాజీ మంత్రిని, అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతను విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి లభించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ అనుమతి రావడంతో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా, ఇదే కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు సంబంధించిన ప్రాసిక్యూషన్ ఫైల్ ప్రస్తుతం కేంద్రం పరిధిలోని డీవోపీటీ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇక ఏ3గా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్
రెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
ఈ కేసు వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక కోణాలపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా–-ఈ రేస్ నిర్వహించారు. ఈ క్రమంలో అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఎండీఏ నిధులను మళ్లించారన్నది ప్రధాన అభియోగం. గతేడాది డిసెంబర్ 18న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దాదాపు 9 నెలల పాటు సాగిన ఈ దర్యాప్తులో ఏసీబీ అధికారులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. ఈ ఏడాది జనవరి 8న అరవింద్ కుమార్‌ను, 9న కేటీఆర్‌ను, 10న బీఎల్ఎన్ రెడ్డిని, ఆ తర్వాత గ్రీన్ కో ఏస్ నెక్ట్స్ జెన్ ఎండీ అనిల్ కుమార్‌ను విచారించారు. జూన్ 16న కేటీఆర్‌ను రెండోసారి కూడా ప్రశ్నించారు. ఈ విచారణలో అధికారులంతా కేటీఆర్ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని, లండన్ కంపెనీతో సంప్రదింపుల నుంచి చెల్లింపుల వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని స్టేట్‌మెంట్లు ఇవ్వడం.. కేటీఆర్‌కు ఈ కేసులో ఉచ్చు బిగుసుకునేలా చేసింది.
ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధంగా నిధుల విడుదల..
ఎలక్షన్కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ అనుమతి లేకుండా నిధులు విడుదల చేయడం ఈ కేసులో మరో కీలకాంశంగా మారింది. 2023 అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే హెచ్‌ఎండీఏ సాధారణ నిధుల నుంచి రూ.45.71 కోట్లు విదేశీ కరెన్సీగా మార్చి లండన్‌కు బదిలీ చేశారు.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఫారిన్ ట్రాన్సాక్షన్లపై ఐటీ శాఖ హెచ్‌ఎండీఏకు రూ.8.07 కోట్ల జరిమానా కూడా విధించింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో హెచ్‌ఎండీఏ ఖజానా నుంచి రూ.54.89 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఏసీబీ అధికారులు ఈ కేసులో మొత్తం 10 మందిపై అభియోగాలు మోపుతూ వెయ్యికి పైగా డాక్యుమెంట్లను జతచేసి, 78 పేజీల సమగ్రమైన ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా లభించడంతో ప్రభుత్వం చట్టపరమైన చర్యలను వేగవంతం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది బీఆర్‌ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు రాజకీయంగా పెను సవాలుగా మారనుంది.
బీఆర్ఎస్‌కు రూ.44 కోట్ల లబ్ధి..
ఫార్ములా–ఈ రేస్ కేసులో భారీ ఎత్తున రాజకీయ అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక స్పష్టం చేస్తున్నది. ‘క్విడ్ ప్రో కో’ (ప్రతిఫలం ఆశించి మేలు చేయడం) అంటే ప్రభుత్వ నిధులను వ్యూహం ప్రకారం ప్రైవేట్ కంపెనీకి మళ్లించి, ఆ కంపెనీ ద్వారా పార్టీ ఫండ్‌గా మార్చుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఇది రుజువైతే కేటీఆర్‌కు శిక్ష ఖాయమని తెలుస్తున్నది. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ రేసు నిర్వహణ వల్ల హెచ్‌ఎండీఏ ఏకంగా రూ.75.88 కోట్లు నష్టపోగా, ఫార్ములా–ఈ -ఆపరేషన్స్ సంస్థ రూ.46 కోట్లు లబ్ధి పొందింది.
ఇందుకు ప్రతిఫలంగా సదరు సంస్థ నుంచి బీఆర్‌ఎస్‌కు రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్టు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. ఒప్పందం ప్రకారం రేసు నిర్వహణ డబ్బును ఏస్ నెక్ట్స్ జెన్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఆ సంస్థ చేతులెత్తేయడంతో అప్పటికప్పుడు ప్రభుత్వమే ఆ భారం మోసేలా కొత్త ఒప్పందాలు సృష్టించారని దర్యాప్తులో తేలింది.
