నాలుగు స్టోర్లను మూసేసిన టీజీ సేఫ్
హైదరాబాద్, వెలుగు: క్షణాల్లో నిత్యావసరాలు డెలివరీ చేసే డార్క్ స్టోర్లలో కనీస పారిశుధ్యం కొరవడింది. ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తామంటున్న క్విక్ కామర్స్ సంస్థల గోదాముల్లో ఆహార భద్రతా ప్రమాణాలు దారుణంగా ఉన్నట్లు టీజీ సేఫ్ తనిఖీల్లో వెల్లడైంది. టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 10 బృందాలు హైదరాబాద్ పరిధిలోని 16 డార్క్ స్టోర్లలో సోదాలు నిర్వహించాయి.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, డ్రాప్‌ఎక్స్ లాజిస్టిక్స్ గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. పలు స్టోర్లలో ప్రాంగణాలు మురికిగా ఉండటంతోపాటు దుమ్ము, బూజు కనిపించాయి. ఆహార పదార్థాలు నిల్వ చేసే ర్యాకులు తుప్పుపట్టి ఉండగా, గదుల్లో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. డెలివరీకి సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోయి, ఫంగస్ పట్టి ఉన్నాయి. గడువు ముగిసిన, దెబ్బతిన్న ఫుడ్ ప్యాకెట్లు, కోల్డ్ రూమ్‌లలో సరైన ఉష్ణోగ్రతలు నిర్వహించకపోవడంతో పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌లు కరిగిపోయి లీకవుతున్నట్లు గుర్తించారు.
నాలుగు స్టోర్ల లైసెన్సులు రద్దు
తీవ్రమైన లోపాలు గుర్తించిన నాలుగు డార్క్ స్టోర్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు రద్దు చేసి, కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఎక్స్‌పైరీ సరుకులు, రికార్డుల లోపాలను గుర్తించారు. చార్మినార్ పత్తర్‌గట్టిలోని ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లో పాడైపోయిన కూరగాయలు, తుప్పుపట్టిన ర్యాకులు, కోల్డ్ రూమ్ సమస్యలు బయటపడ్డాయి. రాంకోటిలోని జెప్టో కేంద్రంలో బొద్దింకలు, ఫంగస్ పట్టిన ఆహార పదార్థాలు గుర్తించారు. సైదాబాద్ ఎస్‌బీహెచ్ బ్యాంక్ కాలనీలోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఎక్స్‌పైరీ సరుకులు, కరిగిపోయిన ఐస్‌క్రీమ్‌లు, అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు.
15 శాంపిళ్లు ల్యాబ్‌కు
తనిఖీల్లో అనుమానం ఉన్న 15 ఫుడ్ శాంపిళ్లను సేకరించి నాణ్యతా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మరో ఐదు స్టోర్లకు జరిమానా విధించేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిజాంపేట్, గాజులరామారం, షా అలీబండలోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, మూసారాంబాగ్, గోల్కొండ రేతిగల్లీలోని ఫ్లిప్‌కార్ట్ కేంద్రాలు ఇందులో ఉన్నాయి. చింతల్, గాజులరామారంలోని ఫ్లిప్‌కార్ట్, చింతల్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. నిబంధనలు పాటించకపోతే మరోసారి తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ అధికారులు తెలిపారు.
