సోనుసూద్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మోసాలు

సోనుసూద్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మోసాలు

ఖమ్మం జిల్లా: సినీ నటుడు సోనుసూద్ పేరు సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సోనుసూద్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా లక్ష్మీ దేవిపల్లి మండలం అనిశెట్టిపల్లికి చెందిన మేఘనాథ్ అనే బాలుడు లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. బాలుడి తలిదండ్రులు హైదరాబాద్ లోని పలు హాస్పిటల్ లో చూపించారు. అయితే లివర్ ప్లాంటెషన్ కోసం 18లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఇదే అదునుగా చేసుకున్న నేరగాళ్లు..తాము సోనుసూద్ చారిటబుల్ ట్రస్టు నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. తమ ట్రస్ట్ నుంచి 18లక్షలు అకౌంట్లో వేస్తామని.. అందుకు మీ ఫోన్ కు వచ్చే లింక్, ఓటీపీ చెప్పలన్నారు. కేటుగాళ్ల మాటలు విని చెప్పినట్లు చేశారు. వెంటనే షాకింగ్ మెసేజ్ వచ్చింది. వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో వారి అకౌంట్లో ఉన్న 14వేల రూపాయల్ని డ్రా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మోసపోయామని తెలుసుకున్న బాధితులు లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టామని తెలిపారు. ఓవైపు బిడ్డ ప్రాణం గాల్లో దీపంలా ఉందని బాధపడుతున్న ఆ దంపతులను సైబర్ మోసగాళ్లు చీటింగ్ చేసి డబ్బులు కాజేయడం దారుణమన్నారు. ఎలాగైనా నిందితుల్ని పట్టుకుంటామని..డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తామని చెప్పారు పోలీసులు.