గాయపడ్డాను.. అందుకే ప్రమాదకరంగా మారాను.. ఆప్‌ కు రాఘవ్ చద్దా ధురంధర్ డైలాగ్ ఛాలెంజ్

గాయపడ్డాను.. అందుకే ప్రమాదకరంగా మారాను..  ఆప్‌ కు రాఘవ్ చద్దా  ధురంధర్ డైలాగ్ ఛాలెంజ్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తప్పించిన కొద్ది రోజుల తర్వాత ఓ వీడియో మేసేజ్ తో పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్‌లో సరైన సమస్యలను లేవనెత్తడం లేదంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ఆయన, మూడు ప్రధాన ఆరోపణలతో పార్టీకి సవాల్ విసిరారు. 'ధురంధర్' సినిమాలోని ఓ  డైలాగ్‌ను చెబుతూ సవాల్ విసిరారు.

కేంద్రంలో ప్రధానమంత్రిని, బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని వాస్తవ సమస్యలపై పోరాడకుండా.. విమానాశ్రయ క్యాంటీన్లలో సమోసాల ధరల వంటి అంశాలను లేవనెత్తుతూ చద్దా "సాఫ్ట్ పీఆర్" (Soft PR) కు పాల్పడుతున్నారని పార్టీ సహచరులు ఆరోపించడంతో ఆప్‌కు, ఆయనకు మధ్య విభేదాలు తొలిసారిగా బయటపడ్డాయి.

3 నిమిషాల వీడియోలో..

మూడు నిమిషాలకు పైగా నిడివి గల వీడియోలో, తనపై ఆప్ చేసిన ఆరోపణలను రాఘవ్ చద్దా తిరస్కరించారు. అవన్నీ  అబద్ధాలని తనపై కుట్రపూరితంగా చేస్తున్న  ప్రచారంలో భాగమని మండిపడ్డారు. ప్రతిపక్షాల వాకౌట్‌లలో తాను పాల్గొనలేదన్న వాదనలను ఆయన కొట్టిపారేస్తూ, అదొక  పచ్చి అబద్ధం అని పేర్కొన్నారు. తాను వాకౌట్‌లో పాల్గొనని సందర్భం ఒక్కటైనా చూపించాలని విమర్శకులకు ఆయన సవాలు విసిరారు. పార్లమెంటు కార్యకలాపాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయని ఆయన గుర్తుచేశారు.

ALSO READ : మా నాన్న ఎమ్మెల్యే.. నా కారునే ఆపుతావా..

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కి సంబంధించిన తీర్మానంపై సంతకం చేయడానికి తాను నిరాకరించానన్న మరో ఆరోపణను కూడా చద్దా ఖండించారు. ఆ తీర్మానంపై సంతకం చేయాలని ఏ పార్టీ నాయకుడూ తనను అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు తన పార్టీలోని పలువురు ఎంపీలు కూడా ఆ తీర్మానంపై సంతకం చేయలేదని ఆయన వెల్లడించారు.

రాఘవ్ చద్దా ధురంధర్ డైలాగ్ ఛాలెంజ్

ప్రస్తుతం ఆప్ అధిష్టానంతో తీవ్ర విభేదాలు ఎదుర్కొంటున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన వీడియో చివర్లో  ధురంధర్  సినిమాలోని ఒక డైలాగ్‌ను చెబుతూ సవాల్ విసిరారు.  ఘాయల్ హూన్ ఇసిలియే ఘాతక్ హూన్ (నేను గాయపడ్డాను, అందుకే ఇంత ప్రమాదకరంగా మారాను) అని , "ప్రతి అబద్ధం బట్టబయలవుతుంది" అని హెచ్చరించారు.