- మూడు కార్పొరేషన్లలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్
- పర్మినెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ ఫర్ కు కసరత్తు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆధార్ లోని అడ్రస్ ఆధారంగా పర్మినెంట్ ఎంప్లాయీస్‌ను ట్రాన్స్ ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే విధులు కేటాయించే ఉద్దేశంతో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల ఆధార్ కార్డులోని అడ్రస్ ను ప్రామాణికంగా తీసుకుని బదిలీలు చేపట్టేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో డ్యూటీలు చేస్తున్న వారి ఆధార్ కార్డుల వివరాలను సేకరించే పనిలో పడింది.
గతంలో ఇష్టమున్నట్టు బదిలీలు
గతంలో పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన టైంలో బదిలీలు పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగుల ఇండ్లు, హెల్త్ ఇష్యూస్ ను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టమున్నట్టు బదిలీలు చేశారనే విమర్శలున్నాయి. దీని వల్ల చాలామంది ఉద్యోగులు శివారులో ఉంటూ ఎక్కడో ఉన్న మరో కార్పొరేషన్ లో డ్యూటీలు చేసి గంటల పాటు జర్నీ చేసి తిరిగిరావాల్సి వచ్చేది. దీనివల్ల సమయం వృథా కావడంతో పాటు, పనితీరుపై ప్రభావం పడుతోందని అధికారులు సైతం గుర్తించారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, వయసు పైబడిన ఉద్యోగులు, మహిళలు ఈ బదిలీల కారణంగా ఎక్కువ అసౌకర్యానికి గురవుతున్నారని తెలుసుకున్నారు.
ఇండ్లకు సమీపంలోనే విధులు..
మూడు కార్పొరేషన్లలో బదిలీలకు సంబంధించిన వ్యవహారం జీహెచ్ఎంసీ చూస్తుండడంతో తమ ఇండ్లకు సమీపంలోని కార్పొరేషన్లలో డ్యూటీలు చేసేలా అవకాశం కల్పించాలని బాధిత ఉద్యోగులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, వారి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. పైరవీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా బదిలీలను నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఫీల్డ్లెవెల్నుంచి హెడ్డాఫీసు వరకు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆధార్ వివరాలను సేకరించి ఒక సమగ్ర డేటాబేస్ సిద్ధం చేస్తోంది. ఆధార్‌లో ఉన్న అడ్రస్ఆధారంగా ఉద్యోగి ఇంటిని ధ్రువీకరించి, ఆ అడ్రస్‌కు దగ్గరలో ఉన్న ఏ ఆఫీసుల్లో ఖాళీలు ఉన్నాయో మ్యాపింగ్ చేయనున్నది. ఆధార్ వివరాల సేకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత, బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసి, ఆకస్మిక బదిలీలకు బదులుగా శాస్త్రీయ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
