ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు

ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు
  • ఉద్యోగులు, టీచర్ల ఎదురుచూపులు
  • ఆర్బీఐ నుంచి సర్కారు అప్పు తీసుకున్నంకే చెల్లింపులు!
  • మరో 4 రోజులు పడుతుందంటున్న ఫైనాన్స్ ఆఫీసర్లు
  • ఈఎంఐలు టైమ్‌‌కు కట్టలేకపోతున్నమంటున్న ఉద్యోగులు 
  • బ్యాంకులు పెనాల్టీలు విధిస్తున్నాయని ఆవేదన 

హైదరాబాద్, వెలుగు: ధనిక రాష్ట్రంలో జీతాలకు కటకట ఏర్పడింది. పదో తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు శాలరీలు అందలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శనివారం నాటికి 14 జిల్లాల్లోని ఉద్యోగులు, టీచర్లకు మాత్రమే జీతాలు జమ చేసినట్లు తెలిసింది. మరో 19 జిల్లాల్లో ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆదివారం సెలవు కావడంతో కనీసం సోమవారమైనా శాలరీలు వేస్తారని ఎంప్లాయీస్ ఆశపడుతున్నారు. అయితే జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఇంకో మూడు, నాలుగు రోజులు పడుతుందని ఫైనాన్స్, ట్రెజరీ శాఖల ఆఫీసర్లు చెప్తున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల రోజులకే.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే శాలరీలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఉండటంతో రానున్న రోజుల్లో.. ఎట్లుంటదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిధుల్లేకనే ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ప్రతినెలా జీతాలు విడతల వారీగా జిల్లాలకు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈసారైనా ఇస్తరనుకుంటే..

రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తూ వస్తున్నది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో జీతాలు ఫస్ట్ తారీఖునే వస్తాయని ఆశించిన ఉద్యోగులు భంగపడ్డారు. 

ప్రభుత్వం ఈ నెల 11న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఆ తర్వాత జీతాలు, పెన్షన్ల చెల్లింపులు పూర్తవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ ఏడాది ఆశించిన మేరకు రాబడి పెరిగినా.. జీతాలకు, ఇతర ఏ అవసరాలకైనా అప్పులే దిక్కవుతున్నాయి. లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు రిజిస్ట్రేషన్లతో భారీగా ఆదాయం వస్తున్నా గతంలో తెచ్చిన అప్పులు, వడ్డీల చెల్లింపులకే ప్రతినెలా రూ.3 వేల కోట్ల దాకా కట్టాల్సి వస్తోంది. ఇవీకాక పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం.. వాటికి నిధులు సర్దుబాటు చేయలేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారినట్లు నిపుణులు అంటున్నారు.

ప్రతినెలా రూ.4 వేల కోట్లు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు, ఇతర ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతినెలా శాలరీల రూపంలో రూ.2,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు రూ.1,400 కోట్ల దాకా అవుతున్నాయి. అంటే నెలకు రూ.4 వేల కోట్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జీతాలు, పెన్షన్లకు రూ.48 వేల కోట్లు అవుతాయి. మరోవైపు ఈ ఏడాది రూ.59 వేల కోట్ల భారీ అప్పు తీసుకోవాలని సర్కార్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ప్రతినెలా రూ.5 వేల కోట్లు అప్పు తీసుకునేలా ప్లాన్ చేసుకుంది. ఆదాయం మాట అటుంచితే తెచ్చిన అప్పుల్లో నుంచే శాలరీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

ఉద్యోగుల ఇక్కట్లు

హైదరాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వికారాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్,  భూపాలపల్లి, నారాయణ పేట్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లోని ఉద్యోగులకు జీతాలు జమ కాగా, మిగతా జిల్లాల్లో ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు తెలిసింది. జీతాలు ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉద్యోగులు, టీచర్లు చెబుతున్నారు. 90 శాతం ప్రభుత్వ ఉద్యోగులు హోం లోన్లు తీసుకున్నామని, పర్సనల్ లోన్లు తీసుకొని పిల్లలని చదివిస్తున్నామని, ఈఎంఐలు టైంకు కట్టలేకపోతున్నామని అంటున్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పదో తారీఖు లోపు వాయిదాలు చెల్లించకపోతే  తమ ఖాతాలను స్తంభింపజేసి పెనాల్టీలు విధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆసరా పరిస్థితీ అంతే

రాష్ట్రంలో ఆసరా చెల్లింపులదీ అదే పరిస్థితి. ప్రతినెలా మొదటి వారంలో ఆసరా ఇస్తుండగా.. ఇప్పుడు ఈనెల 20 తేదీ తర్వాతే ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు, కొత్త ఆసరా పెన్షన్లు, దళితబంధు స్కీం ఇతరత్రా వంటివి ఇప్పట్లో మొదలుపెట్టే సూచనలు కనిపించడం లేదు.

టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెల్లించాలి

జీతాలు అందకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నరు. దేశంలోకెల్లా తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెబుతున్న పాలకులు.. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికిపైగా ఆలస్యంగా శాలరీలు చెల్లిస్తున్నారు. సర్కారుకు ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం, చులకన భావం వల్లే వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నది. ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతే. సకాలంలో వేతనాలు చెల్లించడం ప్రభుత్వ కనీస బాధ్యత.
- కె.రమణ, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ 
   ఫెడరేషన్ ప్రెసిడెంట్

సర్కార్ ప్లాన్ సక్కగ లేదు

ఆర్థిక వ్యవహారాల విషయంలో రాష్ట్ర సర్కార్ ప్లాన్ సక్కగ లేదు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు పదో తేదీ, 15వ తేదీ దాకా పోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే.. రెండు నెలల జీతాలు కలిపి ఒకేసారి ఇస్తారేమో అని భయం వేస్తున్నది. జిల్లాల వారీగా ఒక్కో తేదీలో ఒక్కోరకంగా జీతాలు వేస్తున్నరు. శాలరీల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీరు మార్చుకోవాలి.
- ఓ ప్రభుత్వ ఉద్యోగి