
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రచారం
- ప్రభుత్వ స్కూల్స్‌లో రిజల్ట్ పెరగడంతో తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు
మహబూబాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో బెస్ట్ రిజల్ట్స్ రావడంతో ప్రతి ఏడాది జూన్‌లో షురూ అయ్యే బడిబాట ప్రోగ్రామ్ఈనెల 9న మొదలుపెట్టారు. రాష్ర్ట విద్యాశాఖ ప్రభుత్వ ఉపాధ్యాయులను అలర్ట్ చేయడంతో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మేలో ప్రతి శుక్రవారం 9, 16, 23, 30 చేపట్టగా, జూన్ 6న మెగా ప్రోగ్రామ్‌ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో నిర్వహించనున్నారు.
గ్రామాల్లో ప్రచారం విస్తృతం..
కరపత్రాలు, బ్యానర్లు, సర్కారు స్కూల్స్‌లో చదవడం ద్వారా ఉపయోగాలు, అనుభవజ్ఞులైన టీచర్స్, ఉచిత యూనీఫామ్స్, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఇలా అన్ని ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ టీచర్లు ప్రచారం చేస్తున్నారు. తమ స్కూల్పదో తరగతి విద్యార్థులు సాధించిన వివరాలను తల్లిదండ్రులకు చెబుతూ గవర్నమెంట్ బడిలో విద్యార్థులు చేర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రామపంచాయతీ, జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, పిల్లల తల్లిదండ్రులు, అంగన్ వాడీల సహకారంతో బడిబాట కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా 775, వరంగల్ 530, హనుమకొండ 467, జనగామ 460, జయశంకర్ భూపాలపల్లి 416, ములుగు 331 ప్రభుత్వ స్కూల్స్‌లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావడంతో తల్లిదండ్రులు కూడా సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారని బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న వారు చెబుతున్నారు.
గవర్నమెంట్స్కూల్స్లో చేర్పించండి..
బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూల్స్‌లో చేర్పించాలి. ప్రభుత్వ స్కూల్స్‌లోనే అనుభాజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. సమష్టి కృషితో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిపాం. ప్రభుత్వ స్కూల్స్‌లోనే పదో తరగతిలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ మోజులో పడి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి సర్కారు బడుల్లోనే తమ పిల్లలను చేర్పించాలి. టీచర్లు మరింత అంకిత భావంతో పని చేసేలా చర్యలు చేపడుతాం.-రవీందర్‌రెడ్డి, డీఈవో, మహబూబాబాద్