
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయంగా పోటీ పడదామని, మిగతా సమయంలో అందరం యూనిటీగా ఉంటూ పార్టీలకతీతంగా అభివృద్ధికి పాటుపడదామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పీఏసీఎస్ గోదాంలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్న ఆయన.. రైతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సీఎం రేవంత్ రెడ్డి.. రైతు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చి రైతులు అధిక లాభాలు పొందేలా చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయనివిధంగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్యా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ దేశ్యానాయక్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.