- గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
- కరోనా టైమ్లో పోలీసుల సేవలను వివరిస్తూ రాసిన ‘ది ఎక్స్‌ట్రా మైల్’ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కోవిడ్-19 మహమ్మారి సమయంలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సేవలను వివరిస్తూ రాసిన ‘ది ఎక్స్‌ట్రా మైల్’ పుస్తకం కళ్లకు కట్టిందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్‌భగవత్ తో కలిసి గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ లాక్డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు, ఐటీ నిపుణులు, వలంటీర్లు చేసిన అసాధారణ సేవలను ఈ పుస్తకం వివరిస్తుందన్నారు.
12.50 లక్షల ఫుడ్‌ప్యాకెట్లు, 1.40 లక్షల నిత్యావసర కిట్లు పంపిణీ చేశారని, 6 లక్షల ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించడం, 18 వేల యూనిట్ల ప్లాస్మా సేకరణ, ఒక్క రోజులో 38 వేల మందికి వ్యాక్సినేషన్ అందించి ప్రపంచ రికార్డు సృష్టించడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టి చేసిన సేవలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయన్నారు. తర్వాత డీజీపీ, ఏడీజీపీ మాట్లాడారు. ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుస్తక సహ రచయిత డాక్టర్ అరుణ్ తివారీ, ఎస్సీఎసీ మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల కలిసి ఈ పుస్తకం రచించారన్నారు. ఎక్స్‌ట్రా మైల్ వరకు సైబరాబాద్ పరిణామం, కరోనా సవాలును ఎదుర్కొన్న విధానాన్ని రచయితలు సమగ్రంగా వివరించినట్టు తెలిపారు.
